ఆఖరి అవకాశం!
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్ 0-4తో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సొంత గడ్డపై కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఒకేసారి ఆ రెండింటికీ ప్రతీకారం తీర్చుకుంటామనే పట్టుదల ఈ సిరీస్‌కు ముందు భారత యువ జట్టులో కనిపించింది. ఇంగ్లండ్ పేలవమైన ఫామ్‌లో ఉండటం అందుకు కారణమైంది. ఇక లార్డ్స్‌లో విజయం సాధించగానే భారత్ తిరుగులేని స్థితిలో నిలిచినట్లు అనిపించింది.
అయితే... ఒక్కసారిగా ధోని సేన సుడి మారిపోయింది! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏదీ కలిసి రాలేదు. దాంతో వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఫలితంగా మన జట్టు ఆత్మవిశ్వాసం అడుగంటితే... ప్రత్యర్థి మాత్రం అమితోత్సాహంతో ఉంది.
ఇకపై సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కనీసం సమం చేసినా భారత్ పరువు నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిరీస్ కోల్పోలేదన్న సంతృప్తి దక్కుతుంది. అలా జరగాలంటే ఇప్పుడు ఆఖరి అవకాశం జట్టు ముంగిట నిలిచింది. అయితే ఏ ఒక్కరో కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తేనే అది సాధ్యమవుతుంది.
►ధోని సేన సత్తాకు పరీక్ష
►తీవ్ర ఒత్తిడిలో భారత్
►సిరీస్‌పై ఇంగ్లండ్ గురి
నేటినుంచి ఆఖరి టెస్టు మ.గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ ధోని బృందం నేటినుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు సమాయాత్తమైంది. సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలన్నా... ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపు మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా సిరీస్‌ను గెలుచుకునే స్థితిలో ఇంగ్లండ్ ఉంది. ఆటగాళ్ల ఫామ్‌తో పాటు తుది జట్టు కూర్పు వరకు టీమిండియా సమస్యల్లో ఉండగా... కుక్ సేన మాత్రం వరుస విజయాలు ఇచ్చిన జోరుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.
ఇషాంత్ ఖాయం...
లార్డ్స్‌లో సంచలన బౌలింగ్ తర్వాత గాయంతో రెండు టెస్టులకు దూరమైన ఇషాంత్ ఈ టెస్టు బరిలోకి దిగనున్నాడు. మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని నిర్ధారించింది. రెండు రోజుల పాటు అతను ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. పంకజ్ సింగ్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. ఇషాంత్ వస్తే భువనేశ్వర్, ఆరోన్‌లతో కలిసి జట్టు పేస్ బౌలింగ్ పదునెక్కుతుంది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో ఆడనున్నట్లు ధోని ప్రకటించాడు. ముగ్గురు పేసర్లతో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటాడు. అయితే ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానంలో స్టువర్ట్ బిన్నీని తీసుకురావచ్చని అంచనా.
ప్రాక్టీస్ సెషన్‌లో బిన్నీ సుదీర్ఘంగా సాధన చేయడం కూడా దీనికి సంకేతంగా చెప్పవచ్చు. మరోవైపు గంభీర్, ధావన్‌లలో ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. మొదటి మూడు టెస్టులు ధావన్ ఆడాడు కాబట్టి... గంభీర్‌కే మరో చాన్స్ ఇవ్వవచ్చని వినిపిస్తోంది. లార్డ్స్‌లో ఆకట్టుకున్న రహానే తర్వాతి రెండు టెస్టుల్లో రాణించలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అన్నింటికి మించి పుజారా, కోహ్లిల ప్రదర్శనపైనే జట్టు విజయావకాశాలు ఉన్నాయనేది స్పష్టం. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గౌరవప్రదంగా సిరీస్ ముగించవచ్చు.
రాబ్సన్ మినహా...
మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. జట్టులోని ఆటగాళ్లలో ఓపెనర్ రాబ్సన్ మినహా అందరూ ఏదో ఒక దశలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టులో రాణించినా... కుక్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే ఈ సారైనా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్న గ్యారీ బ్యాలెన్స్, ఫామ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ జో రూట్ బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. సీనియర్ బెల్‌తో పాటు కీపర్ బట్లర్ బ్యాటింగ్ కూడా కీలకం కానుంది.
తన స్పిన్‌తో భారత బ్యాటింగ్ పనిపట్టిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఈసారి అతను రాణిస్తాడని ఇంగ్లండ్ ఆశిస్తోంది. రాబ్సన్ విఫలమవుతున్నా... విజయాల జట్టును మార్చే ఆలోచన ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌కు లేదు. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ మ్యాచ్ ఆడనున్నాడు. ముఖానికి ప్లాస్టర్ ఉన్నా... అతను ఎలాంటి అసౌకర్యం లేకుండా గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇక టీమిండియాపై మైదానంలోనూ, బయటా సమస్యగా మారిన అండర్సన్‌పై ఆ జట్టు ఎంతో ఆధారపడుతోంది.
జట్లు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), విజయ్, గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, ఆరోన్, ఇషాంత్.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బ్యాలెన్స్, ఇయాన్ బెల్, రూట్, మొయిన్ అలీ, బట్లర్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోర్డాన్.
ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో పాటు అండర్సన్‌కూ మంచి రికార్డు లేకపోవడం భారత్‌లో ఉత్సాహం నింపే అంశం. గత నాలుగేళ్లలో ఓవల్‌లో ఇంగ్లండ్ ఒక్కటే టెస్టు నెగ్గింది. 2010 నుంచి ఆ జట్టుకు ఇతర వేదికల్లో ఎక్కడా ఇలాంటి పేలవ రికార్డు లేదు. ఈ మైదానంలో అండర్సన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్లు తీయలేకపోయాడు. ఇక్కడ గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అతను ఒకేసారి రెండుకు మించి వికెట్లు తీయగలిగాడు. మరోవైపు ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే భారత్‌కు ఓవల్‌లోనే కాస్త మెరుగైన రికార్డు ఉంది. పైగా ప్రపంచంలోని ఏ గ్రౌండ్‌లో కూడా భారత్ ఇన్ని (7) మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించలేదు. గత ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఏదో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ కనీసం 400 పరుగులు దాటగలిగింది.
పిచ్
ఓవల్ పిచ్ గతంలో స్పిన్‌కు బాగా అనుకూలించినా ఇటీవల ఆ పరిస్థితి లేదు. అయితే నాలుగో టెస్టుతో పోలిస్తే ఇక్కడ వేగం, బౌన్స్ తక్కువ. భారత జట్టుకు ఇది అనుకూలాంశమనే చెప్పాలి.
వాతావరణం
గురువారం ఒక్కసారిగా వర్షం రావడంతో భారత్ ప్రాక్టీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. టెస్టు జరిగే సమయంలో కూడా వర్షానికి అవకాశం ఉన్నా... మ్యాచ్‌కు అంతరాయం కలగకపోవచ్చు.