తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 473/8
రోహిత్, గిల్ సెంచరీలు
ప్రస్తుత ఆధిక్యం 255 పరుగులు
రాణించిన పడిక్కల్, సర్ఫరాజ్
ధర్మశాల టెస్టు మ్యాచ్ రెండో రోజు ఊహించినట్లుగానే అంచనాలకు అనుగుణంగా సాగింది...పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శుక్రవారం ఆటలో 338 పరుగులు రాబట్టింది...రోహిత్, గిల్ సెంచరీలు పూర్తి చేసుకొని సగర్వంగా నిలవగా...యువ ఆటగాళ్లు పడిక్కల్, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యంతో తమ వంతు పాత్ర పోషించారు.
ఒక దశలో ఒక పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా దాని ప్రభావం జట్టుపై పడలేదు... ఫలితంగా ఇప్పటికే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా విజయానికి కావాల్సిన సరంజామాను సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ భారత పర్యటనలో తమ చివరి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఇంగ్లండ్ ఏమాత్రం పోరాటపటిమ కనబరుస్తుందనేది చూడాలి. ఒకవేళ భారత స్పిన్నర్లు రాణిస్తే మూడోరోజు భారత్ ఘన విజయం సాధించే అవకాశం కూడా ఉంది.
ధర్మశాల: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 4–1తో ముగించే దిశగా భారత జట్టు వేగంగా దూసుకుపోతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (150 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ శర్మ (162 బంతుల్లో 103; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. దేవ్‌దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 97 పరుగులు జత చేయడం విశేషం.
శతకాలు పూర్తి...
రెండో రోజు ఆటను రోహిత్, గిల్ బౌండరీలతో దూకుడుగా మొదలు పెట్టారు. వీరిని నిలువరించేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. 68 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను క్రాలీ వదిలేయడం భారత్‌కు కలిసి రాగా, 64 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ముఖ్యంగా వుడ్, బషీర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ధారాళంగా పరుగులు రాబట్టారు. ఇదే జోరును కొనసాగిస్తూ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు.
154 బంతుల్లో రోహిత్ 12వ టెస్టు సెంచరీ రాగా, 137 బంతుల్లో గిల్ నాలుగో సెంచరీని అందుకున్నాడు. తొలి సెషన్‌లో భారత్ 30 ఓవర్లలో 129 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే లంచ్ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరు వెనుదిరిగారు. గత జూన్ తర్వాత తొలి సారి బౌలింగ్‌కు దిగిన స్టోక్స్ తన మొదటి బంతికే రోహిత్‌ను బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో గిల్‌ను మరో చక్కటి బంతితో అండర్సన్ బౌల్డ్ చేశాడు.
కుర్రాళ్ల జోరు...
మూడో వికెట్‌గా గిల్ అవుటైన సమయంలో భారత్ ఆధిక్యం 61 పరుగులు మాత్రమే! రెండు కీలక వికెట్లు తీసి ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లండ్ సిద్ధం కాగా...భారత యువ బ్యాటర్లు పడిక్కల్, సర్ఫరాజ్ దానిని సమర్థంగా అడ్డుకున్నారు. మూడో టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్, అరంగేట్ర బ్యాటర్ పడిక్కల్ భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లింది. అండర్సన్ ఓవర్లో మూడు ఫోర్లతో ధాటిని చూపిన పడిక్కల్ తొలి 30 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం.
మరో వైపు ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఆ తర్వాత జోరు పెంచాడు. వుడ్ బౌలింగ్‌లో అతను కొట్టిన 3 ఫోర్లు, సిక్స్ హైలైట్‌గా నిలిచాయి. బషీర్ ఓవర్లో 2 ఫోర్లతో సర్ఫరాజ్ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్‌లో భారత్ 24 ఓవర్లలో 112 పరుగులు రాబట్టింది. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే సర్ఫరాజ్ వెనుదిరిగాడు.
అనంతరం 83 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న పడిక్కల్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. జురేల్ (15) ప్రభావం చూపలేకపోగా...హార్ట్‌లీ ఒకే ఓవ ర్లో జడేజా (15), అశ్విన్ (0)లను వెనక్కి పంపాడు. ఈ దశలో కుల్దీప్ (27 బ్యాటింగ్) పట్టుదల కనబర్చగా, బుమ్రా (19 బ్యాటింగ్) అండగా నిలిచాడు. వీరిద్దరు 18 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు.
మూడోరోజు ఆటలో బంతే కీలకం..
భారత జట్టు ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంది. ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత స్పిన్నర్లు చెలరేగితే నేడే దాదాపు భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటిరోజే కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసింది భారత జట్టు. అదే విధంగా మూడో రోజు కూడా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే మన బౌలర్లు తప్పకుండా సత్తా చాటుతారు.
స్కోరు వివరాలు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218;
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బి) స్టోక్స్ 103; గిల్ (బి) అండర్సన్ 110; పడిక్కల్ (బి) బషీర్ 65; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) బషీర్ 56; జడేజా (ఎల్బీ) (బి) హార్ట్‌లీ 15; జురేల్ (సి) డకెట్ (బి) బషీర్ 15; అశ్విన్ (బి) హార్ట్‌లీ 0; కుల్దీప్ (బ్యాటింగ్) 27; బుమ్రా (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (120 ఓవర్లలో 8 వికెట్లకు) 473. వికెట్ల పతనం: 1–104, 2–275, 3–279, 4–376, 5–403, 6–427, 7–427, 8–428. బౌలింగ్: అండర్సన్ 14–1–59–1, వుడ్ 15–1–89–0, హార్ట్‌లీ 39–3–126–2, బషీర్ 44–5–170–4, స్టోక్స్ 5–1–17–1, రూట్ 3–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment