
ఆశల పల్లకిలో భారత జట్టు
అనుభవలేమి ప్రధాన సమస్య
ఇంగ్లండ్‌లో సీనియర్లపై భారం
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 19 సిరీస్‌లు ఆడితే 14 సిరీస్‌లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్‌లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్‌లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.
అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్‌లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్‌ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం
ప్రస్తుతం సిరీస్‌కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్. గత మూడు సిరీస్‌లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రిషభ్ పంత్ ఇంగ్లండ్‌లో గత రెండు సిరీస్‌లు ఆడగా... కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్‌లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగబోతున్నారు.
ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్‌లో ఇదే భారత్‌కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ సిరీస్ సవాల్‌గా నిలవనుంది. బ్యాటర్‌గా ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్ కోచ్‌గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం.
బ్యాటర్లకు సవాల్...
మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం... డ్రైవ్ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్ అంచులను తాకి స్లిప్స్‌లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్ స్టాన్స్‌లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే.
జైస్వాల్ 19 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్‌లోనే సుదర్శన్ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రెండు ఫైనల్‌లను వదిలేస్తే గిల్ ఇంగ్లండ్‌లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్ రాహుల్‌కు ఇంగ్లండ్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు.
ఇక మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్‌పై అందరి దృష్టీ ఉంది. నాయర్‌కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్‌షైర్ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్‌పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్‌బోర్న్ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.
బుమ్రా, సిరాజ్ చెలరేగితే...
ఈ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్‌లా జస్‌ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్‌మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం.
ఎరుపు బంతితో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్ బౌలింగ్ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్‌లో సిరాజ్ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్ కృష్ణ మూడో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి అర్ష్ దీప్‌కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే.
అశ్విన్ రిటైర్మెంట్‌తో ఇప్పుడు కుల్దీప్‌కు తొలిసారి ప్రధాన స్పిన్నర్‌గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా ఆల్‌రౌండర్‌గా రాణించడం ముఖ్యం. సీమ్ బౌలర్ శార్దుల్ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్‌మెంట్ మొగ్గు శార్దుల్ వైపు ఉంది.