న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో క్రికెటేతర కారణాలతో తొలిసారి పూర్తిగా ఒక టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆడని కోహ్లి ఇప్పుడు మిగిలిన మూడు టెస్టులనుంచి కూడా తప్పుకున్నాడు. అతను చివరి మూడు టెస్టులు ఆడటంపై మొదటినుంచీ సందేహంగానే ఉన్నా శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
కోహ్లి సమస్య ఏమిటనేది బయటకు తెలియకపోయినా బోర్డు ఉన్నతాధికారులకు అతని గైర్హాజరుపై స్పష్టత ఉంది. అయితే జట్టును ఎంపిక చేసే ముందు మరోసారి అతనితో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో 17 మంది సభ్యుల బృందాన్ని మిగిలిన మూడు టెస్టుల కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
గాయాల కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరు ఆడటం ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుందని సెలక్టర్లు స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాడని సమాచారం ఉండగా జడేజా తన సొంత మైదానంలో మ్యాచ్ ఆరంభ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
వరుస వైఫల్యాలతో...
టీమ్ ఎంపికలో కీలక మార్పు శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడమే. అతను వెన్ను నొప్పితో బాధపడుతూ మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం వినిపించింది. అయితే అంతర్గత సమాచారం ప్రకారం శ్రేయర్ పూర్తి ఫిట్‌గా సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని...అతని పేలవ ఫామ్ కారణంగానే వేటు పడినట్లు తెలిసింది.
ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్‌ను చాలా బాగా ఆడగలడని పేరున్న అయ్యర్ సొంత గడ్డపై ఇలా విఫలం కావడంతో సెలక్టర్లు పక్కన పెట్టక తప్పలేదు. గత 13 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు.
సిరాజ్ వచ్చేశాడు...
పనిభారం కారణంగా గత టెస్టులో విశ్రాంతినిచ్చిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ముకేశ్ కుమార్ కూడా తన స్థానం నిలబెట్టుకున్నాడు. ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నా... సెలక్టర్లు మరో పేసర్ ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన ఆకాశ్ 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 103 వికెట్లు తీశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపికైనా...మ్యాచ్ అవకాశం రాలేదు.
శనివారం ప్రకటించిన జట్టునుంచి అవేశ్, సౌరభ్ కుమార్‌లను తప్పించగా...జురేల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. రాహుల్ మైదానంలోకి దిగినా...అయ్యర్ స్థానంలో వీరిద్దరిలో ఒకరు ఆడటం ఖాయం. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో, 23నుంచి రాంచీలో, మార్చి 7నుంచి ధర్మశాలలో మూడు, నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.
జట్టు వివరాలు:
రోహిత్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి, గిల్, రాహుల్, పటిదార్, సర్ఫరాజ్, జురేల్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్, ఆకాశ్‌దీప్.
Comments
Please login to add a commentAdd a comment