భారత జట్టు ఫామ్‌లోనే ఉంది
వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్
నాగ్‌పూర్: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు సాగాయి. సీనియర్ల ఆటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ తరహా విమర్శలను వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పు పట్టాడు. నిజానికి తాము ఆసీస్ గడ్డపై కూడా మెరుగ్గానే ఆడామని, కొద్దిలో ఓటమి పాలయ్యామని అతను వివరించాడు.
‘ఒక్క సిరీస్ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గతంలో ఎన్నో టోర్నీల్లో నిలకడగా రాణించారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో మేం అంచనాలకు తగినట్లుగా ఆడలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా విఫలమేమీ కాలేదు. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతను ఆడితే మేం మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసేవాళ్లం. ఒక మ్యాచ్ లేదా ఒక రోజు మా ఆటేంటో చెప్పదు. గతంలో అక్కడ రెండుసార్లు సిరీస్ సాధించాం.
వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వెళ్లడంతో పాటు టి20 వరల్డ్ కప్ కూడా గెలిచామని మరచి పోవద్దు’ అని గిల్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్న గిల్... టీమ్‌లో వరుసగా మార్పులు చేర్పులు సరైంది కాదన్నాడు. ‘విజయ్ హజారే వన్డే ట్రోఫీలో కరుణ్ నాయర్ చాలా గొప్పగా ఆడాడు. అందరూ ఇది అంగీకరించాలి.
కానీ ఎవరి స్థానంలో తీసుకుంటారు. మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు జట్టులో ఉన్నవాళ్లంతా చాలా బాగా ఆడుతున్నారు. మేం వరల్డ్ కప్‌లో ఒక్కటే మ్యాచ్ ఓడాం. కాబట్టి టీమ్‌లో అనవసరపు మార్పులు చేయవద్దు. కొంతకాలం ఒకే టీమ్‌ను కొనసాగించకపోతే జట్టు బలహీనంగా మారుతుంది’ అని గిల్ విశ్లేషించాడు.
వైస్ కెప్టెన్ గా తనపై అదనపు బాధ్యత ఉందని... జట్టుకు అవసరమైనప్పుడల్లా రోహిత్‌కు తన సూచనలు అందిస్తానని గిల్ చెప్పాడు. టి20ల్లో చిత్తుగా ఓడినా... వన్డేల్లో ఇంగ్లండ్ బలమైన జట్టు కాబట్టి గట్టి పోటీ తప్పదని అతను అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment