భారత టి20 జట్టులోకి ఎంపిక
నితీశ్ రెడ్డి, తిలక్ వర్మకు చోటు
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమ్ ప్రకటన
న్యూఢిల్లీ: సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం సెలక్టర్లు శనివారం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించింది. ముందుగా కాలి మడమ, ఆపై మోకాలి గాయంతో బాధపడిన షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 నవంబర్ 19న ఆ్రస్టేలియాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించలేదు.
గాయంతో కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్ తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన షమీ వరుసగా మూడు ఫార్మాట్‌లలో కూడా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టి20 టోర్నీలతో ప్రస్తుతం గురువారం విజయ్‌హజారే వన్డే టోర్నీ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కూడా షమీ బరిలోకి దిగాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేసే అంశంపై చర్చ జరిగింది.
అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత షమీ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. నిజానికి భారత్ తరఫున నవంబర్ 2022 తర్వాత అతను టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఫార్మాట్‌లో యువ పేసర్ల రాకతో షమీ దాదాపుగా జట్టుకు దూరమైపోయాడు.
అయితే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తోనే జరిగే వన్డే సిరీస్, ఆపై చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో వాటికి ముందు టి20ల ద్వారా షమీ ఫిట్‌నెస్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్‌లో అతనికి చోటు లభించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల ఈ బృందం ఎంపికలో ఎలాంటి భారీ మార్పులు, సంచలనాలు చోటు చేసుకోలేదు.
అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతినివ్వగా...గాయంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు తమ చివరి సిరీస్ ఆడిన టీమ్‌లో (దక్షిణాఫ్రికాతో) ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తమ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు.
రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు ఆసీస్‌తో టెస్టులు ఆడిన నితీశ్, హర్షిత్, సుందర్, జురేల్‌లను ఈ టి20 టీమ్‌లోకి తీసుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్‌నూ పక్కన పెట్టారు. ఈ నెల 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న జరిగే ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.
భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్ ), సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్.
Comments
Please login to add a commentAdd a comment