ఆడుతూ... పాడుతూ...
మరోసారి సేమ్ టు సేమ్ సీన్...ఎలాంటి తడబాటు లేదు, ఎలాంటి వైఫల్యమూ లేదు, జింబాబ్వేపై ధోని సేన సంపూర్ణ ఆధిపత్యం... ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత యువ జట్టు ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ప్రయోగంగా భావించిన పర్యటనలో కొత్త కుర్రాళ్లతో కూడా భారత్ అలవోకగా సిరీస్ విజయాన్ని అందుకుంది.
♦ రెండో వన్డే కూడా భారత్‌దే
♦ 8 వికెట్లతో జింబాబ్వే చిత్తు
♦ 2-0తో సిరీస్ సొంతం
హరారే: జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. వుసీ సిబాందా (69 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (3/25) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.
అనంతరం భారత్ 26.5 ఓవర్లలో 2 వికెట్లకు 129 పరుగులు చేసింది. అంబటి రాయుడు (44 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (68 బంతుల్లో 39; 5 ఫోర్లు), రాహుల్ (50 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ భారత్ సొంతమైంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
చహల్‌కు మూడు వికెట్లు
జింబాబ్వే బ్యాటింగ్ గత మ్యాచ్‌ను తలదన్నే రీతిలోనే సాగింది. ఒక దశలో 106/3తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు 9.1 ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడిన జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగగా... బరీందర్ తన వరుస ఓవర్లలో మసకద్జా (9), మూర్ (1)లను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. చిబాబా (21)ను ధావల్ వెనక్కి పంపడంతో 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ దశలో సిబాందా, రజా (16) కొద్ది సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 15.2 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సిబాందా 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జింబాబ్వే కోలుకుంటున్న సమయంలో లెగ్‌స్పిన్నర్ చహల్ అద్భుత బౌలింగ్ ఆ జట్టును దెబ్బ తీసింది. భారీ షాట్ ఆడబోయిన రజా లాంగాన్‌లో చిక్కగా, తర్వాతి బంతికే చిగుంబురా (0) వెనుదిరిగాడు.
చహల్ తన తర్వాతి ఓవర్లోనే సిబాందాను అవుట్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. తన చివరి 2 ఓవర్లను మెయిడిన్‌గా వేసిన చహల్ 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం జింబాబ్వే ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇర్విన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన విలియమ్స్ టాస్ తర్వాత గాయపడి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.
అలవోకగా...
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి మ్యాచ్‌లాగే రాహుల్ మళ్లీ ఆకట్టుకోగా, ఈ సారి కరుణ్ నాయర్ కూడా రాణించాడు. చటారా వేసిన వరుస ఓవర్లలో వీరిద్దరు చెరో రెండు బౌండరీలు బాది ధాటిని ప్రదర్శించారు. అయితే అర్ధ సెంచరీ భాగస్వామ్యం తర్వాత చిబాబా వేసిన బంతిని రాహుల్ వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం నాయర్, రాయుడు కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జత చేశారు. చిగుంబురా, చిబాబా ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన రాయుడు వేగంగా జట్టును విజయానికి చేరువ చేశాడు. మరో 2 పరుగులు చేయాల్సిన సమయంలో నాయర్ అవుటైనా, పాండే (4 నాటౌట్) ముగించాడు.
స్కోరు వివరాలు:
జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) బుమ్రా (బి) బరీందర్ 9; చిబాబా (ఎల్బీ) (బి) ధావల్ 21; మూర్ (ఎల్బీ) (బి) బరీందర్ 1; సిబాందా (సి) జాదవ్ (బి) చహల్ 53; రజా (సి) జాదవ్ (బి) చహల్ 16; చిగుంబురా (ఎల్బీ) (బి) చహల్ 0; ముతుంబామి (సి) ధోని (బి) బుమ్రా 2; క్రీమర్ (నాటౌట్) 7; చటారా (బి) ధావల్ 2; ముజరబని (ఎల్బీ) (బి) అక్షర్ 5; సీన్ విలియమ్స్ (ఆబ్సెంట్‌హర్ట్); ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 126.
వికెట్ల పతనం: 1-19; 2-21; 3-39; 4-106; 5-106; 6-107; 7-112; 8-115; 9-126.
బౌలింగ్: బరీందర్ 6-1-17-2; ధావల్ 9-1-31-2; బుమ్రా 6-0-27-1; అక్షర్ 7.3-0-22-1; చహల్ 6-2-25-3.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చిబాబా 33; నాయర్ (ఎల్బీ) (బి) రజా 39; రాయుడు (నాటౌట్) 41; పాండే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (26.5 ఓవర్లలో 2 వికెట్లకు) 129.
వికెట్ల పతనం: 1-58; 2-125. ; బౌలింగ్: చటారా 8-1-40-0; ముజరబని 3-1-13-0; చిబాబా 9-1-31-1; క్రీమర్ 3-0-17-0; చిగుంబురా 2-0-20-0; రజా 1.5-0-7-1.