మనీశ్ మహిమ... | maneesh mazic... | Sakshi
Sakshi News home page

మనీశ్ మహిమ...

Published Sun, Jan 24 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

మనీశ్ మహిమ...

మనీశ్ మహిమ...

అజేయ సెంచరీతో గెలిపించిన పాండే
రాణించిన రోహిత్, శిఖర్, ధోని
చివరి వన్డేలో నెగ్గిన టీమిండియా

ఆడుతోంది కెరీర్‌లో నాలుగో వన్డే మాత్రమే. ఎదురుగా ఆస్ట్రేలియాతో వారి గడ్డపై భారీ లక్ష్యఛేదన. కానీ యువ ఆటగాడు మనీశ్ పాండే ఏ దశలోనూ తొణకలేదు. ఆద్యంతం సాధికారిక షాట్లు ఆడిన అతను చివరకు అదే దూకుడుతో భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. 11 పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటైన స్థితిలో బరిలోకి దిగి ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. ధోని అండగా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన విలువేమిటో చూపించాడు.

చివరి మూడు ఓవర్లలో భారత్ విజయానికి 35 పరుగులు కావాలి. క్రీజ్‌లో ధోని, పాండే ఉన్నారు. రెండు ఓవర్లలో 22 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. మిషెల్ మార్ష్ వేసిన తొలి బంతి వైడ్ కాగా, ఆ వెంటనే భారీ సిక్సర్ బాదిన ధోని తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అయితే బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న పాండే మరుసటి బంతికే ఆటను ముగించాడు. లక్ష్యానికి చేరువగా వచ్చినా... మళ్లీ విజయంపై సందేహాలు రేకెత్తించిన టీమిండియా ఈసారి మ్యాచ్ చేజారనివ్వలేదు.

 మొత్తానికి 4 పరాజయాల తర్వాత దక్కిన విజయంతో భారత్ పరువు నిలిచింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించగా, పలు రికార్డులు వెల్లువెత్తిన చివరి వన్డేలో భారత్‌కు గెలుపు దక్కింది. టి20 సిరీస్‌కు ముందు ధోని సేనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ధోనికి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.

వహ్వా పాండేజీ..!
ఆ ఇన్నింగ్స్‌లో బాధ్యత ఉంది, దూకుడూ ఉంది... బ్యాటింగ్‌లో జాగ్రత్త కనిపించింది, గెలిపించాలన్న పట్టుదలా కనిపించింది. ఫామ్‌లో ఉన్న టాప్ ఆటగాళ్లు వెనుదిరిగాక, రన్‌రేట్ కొండలా పెరిగిపోతుండగా, ఎవరూ నమ్మకం పెట్టుకోని దశ నుంచి ‘ఫినిషింగ్ టచ్’ ఇచ్చే వరకు 26 ఏళ్ల మనీశ్ పాండే బ్యాటింగ్ అద్భుతంలా కనిపించింది. నేను ఎదురు చూస్తోంది ఇలాంటి చాన్స్ కోసమే అన్నట్లుగా అతను చెలరేగిపోయిన తీరు మరో ప్రతిభ గల యువ ఆటగాడిని క్రికెట్ ప్రపంచం గుర్తించేలా చేసింది.

 మూడో వన్డేలో ఐదు బంతులే ఆడే అవకాశం రాగా, తర్వాతి మ్యాచ్‌లో అతను పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. రహానే లేకపోవడంతో బరిలోకి దిగిన ఈ కర్ణాటక స్టార్ భారత అభిమానుల్లో ఆనందం నింపాడు. రోహిత్, ధావన్‌లు కూడా బాగా ఆడినా... జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది మాత్రం పాండేనే. తీవ్రమైన ఒత్తిడి మధ్య బరిలోకి దిగినా ఎక్కడా అతను దానిని కనబడనీయకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం ఈ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ అంశం.

క్రీజ్‌లో వెనక్కి వెళుతూ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా కొట్టిన మూడు బౌండరీలు సూపర్ అయితే హేస్టింగ్స్ బౌలింగ్‌లో ఒంటికాలిపై కొట్టిన అప్పర్‌కట్ మరో స్పెషల్ షాట్. చివర్లో విజయానికి కీలకంగా మారిన రెండు థర్డ్‌మ్యాన్ బౌండరీలు అతని తెలివితేటలకు నిదర్శనం.

ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వెలుగులోకి వచ్చిన మనీశ్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో మరో మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించి అందరినీ ఆకర్షించాడు. నైనిటాల్‌లో పుట్టినా... తండ్రి ఆర్మీ ఉద్యోగం కారణంగా బెంగళూరులో స్థిరపడిన మనీశ్... ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల కర్ణాటక జట్లలో సత్తా చాటాడు. 2009-10 రంజీ సీజన్‌లో నాలుగు సెంచరీలతో 882 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచిన అతను, కర్ణాటక జట్టు వరుసగా రెండేళ్లు రంజీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

 సీనియర్ల గైర్హాజరీతో గత ఏడాది జింబాబ్వేతో కెరీర్‌లో తొలి వన్డే ఆడి 71 పరుగులు చేసిన మనీశ్, ఈ సిరీస్‌లో తన ఫీల్డింగ్ మెరుపులు కూడా ప్రదర్శించాడు. సిడ్నీలో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతను మంగళవారం తొలి టి20లో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే పాండే ఎంపికైంది వన్డేలకే!           
                             -సాక్షి క్రీడావిభాగం

సిడ్నీ: ఎట్టకేలకు  ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఓ విజయం దక్కింది. భారీ ఛేదనలో కాస్త తడబడినా చివరకు టీమిండియా లక్ష్యాన్ని చేరి క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్ (113 బంతుల్లో 122; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (84 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు.

జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 4 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (81 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ (108 బంతుల్లో 99; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో కోల్పోయాడు. శిఖర్ (56 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హేస్టింగ్స్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 4-1 తో సొంతం చేసుకుంది. మొత్తం 441 పరుగులు చేసిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం మొదలవుతుంది.

సెంచరీ భాగస్వామ్యం...
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. తొలి ఓవర్లోనే ఫించ్ (6)ను అవుట్ చేసి ఇషాంత్ భారత్‌కు శుభారంభం అందించాడు. కొద్దిసేపటికే తన మూడో ఓవర్లో స్మిత్ (28)ను అవుట్ చేసి బుమ్రా వన్డేల్లో తొలి వికెట్ సాధిం చాడు. ఆ వెంటనే బెయిలీ, షాన్ మార్ష్  కూడా అవుటవ్వడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. దాంతో వార్నర్ కూడా తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు.

జట్టు స్కోరు 117/4గా ఉన్న దశలో జత కలిసిన వార్నర్, మిషెల్ మార్ష్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 100 బంతుల్లో భారత్‌పై తొలి సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ చివరకు ఇషాంత్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఒక దశలో అద్భుతంగా ఆడిన మిషెల్ మార్ష్ తొలి సెంచరీ కోసం చివర్లో తడబడటంతో ఆసీస్ పరుగుల జోరు తగ్గింది. భారత బౌలర్లలో బుమ్రా ఆకట్టుకోగా... ఉమేశ్ పేలవ బౌలింగ్ ఆసీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది.

రోహిత్ సెంచరీ మిస్...
భారీ ఛేదనలో మరోసారి రోహిత్, శిఖర్ శుభారంభం అందించారు. ప్రతి బౌలర్‌ను చితకబాది వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 68 పరుగులకు చేరింది. లయోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న శిఖర్... షాన్ మార్ష్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. సిరీస్‌లో చెలరేగుతూ వచ్చిన కోహ్లి (8) ఈసారి విఫలమయ్యాడు. రహానే స్థానంలో జట్టులోకి వచ్చిన మనీశ్ పాండే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

కొన్ని చక్కటి షాట్లు ఆడి సిరీస్‌లో మూడో సెంచరీకి చేరువైన రోహిత్‌ను దురదృష్టం వెంటాడింది. 99 వద్ద హేస్టింగ్స్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఆడబోయి అతను కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 91 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన దశలో ధోని (42 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) బరిలోకి దిగాడు. కెప్టెన్, పాండే మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. 7 పరుగుల వద్ద ధోని ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్‌లో లయోన్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. ఒకవైపు పాండే దూకుడు ప్రదర్శించగా, ధోని జాగ్రత్తగా ఆడాడు. తాను ఎదుర్కొన్న 36వ బంతికి గానీ ధోని ఫోర్ కొట్టలేదు! గెలిచేందుకు ఆరు పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుటైనా, పాండే మిగతా పని పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 6; వార్నర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 122; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 28; బెయిలీ (సి) ఇషాంత్ (బి) రిషి ధావన్ 6; షాన్ మార్ష్ (రనౌట్) 7; మిషెల్ మార్ష్ (నాటౌట్) 102; వేడ్ (సి) ధోని (బి) ఉమేశ్ 36; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 1; హేస్టింగ్స్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 330.
వికెట్ల పతనం: 1-6; 2-64; 3-78; 4-117; 5-235; 6-320; 7-323.
బౌలింగ్: ఇషాంత్ 10-0-60-2; ఉమేశ్ 8-0-82-1; జస్‌ప్రీత్ బుమ్రా 10-0-40-2; రిషి ధావన్ 10-0-74-1; రవీంద్ర జడేజా 10-0-46-0; గుర్‌కీరత్ 2-0-17-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 99; శిఖర్ ధావన్ (సి) షాన్ మార్ష్ (బి) హేస్టింగ్స్ 78; కోహ్లి (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 8; మనీశ్ పాండే (నాటౌట్) 104; ధోని (సి) వార్నర్ (బి) మిషెల్ మార్ష్ 34; గుర్‌కీరత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49.4 ఓవర్లలో 4 వికెట్లకు) 331.
వికెట్ల పతనం: 1-123; 2-134; 3-231; 4-325.
బౌలింగ్: హేస్టింగ్స్ 10-1-61-3; బోలండ్ 10-0-58-0; మిషెల్ మార్ష్ 9.4-0-77-1; ఫాల్క్‌నర్ 10-0-54-0; లయోన్ 8-0-58-0; స్మిత్ 2-0-20-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement