ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెడుతూనే... టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి విమర్శకులకు ఘాటైన సమాధానాలు ఇచ్చాడు. ఇటీవల విదేశాల్లో భారత్ పరాజయాలకు తనదైన భాష్యం చెప్పాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా దూషణల కంటే... నాణ్యమైన ఆటదే పైచేయి అవుతుందని అన్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ కంగారూలను బలహీనులుగా చూడలేమని పేర్కొన్నాడు. సారథి కోహ్లిపై అంచనాలు, జట్టు సన్నద్ధత గురించి సూటిగా మాట్లాడాడు.
బ్రిస్బేన్: విదేశాల్లో ఓటముల విషయంలో టీమిండియానే వెలెత్తి చూపడం తగదని, ఇటీవలి కాలంలో ఏ పర్యాటక జట్టూ మెరుగైన ఫలితాలు సాధించని విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నాడు కోచ్ రవిశాస్త్రి. ఆస్ట్రేలియా చేరిన అనంతరం ఆయన ఆదివారం బ్రిస్బేన్‌లో మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్ పరాజయాల నేపథ్యంలో కోహ్లి సేనకు ఆసీస్‌పై విజయం సాధించడం ఎంత ముఖ్యమనే ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఇచ్చాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి అంటూనే, ప్రస్తుతం విదేశాల్లో ఏ జట్టు ప్రదర్శనా మెరుగ్గా లేదని పేర్కొన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంకా ఏమన్నాడో ఆయన మాటల్లోనే...
అంత ఏకఛత్రాధిపత్యం లేదిప్పుడు...
1990 నుంచి రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా, కొంతకాలం దక్షిణాఫ్రికా విదేశాల్లో సిరీస్‌లు గెలిచాయి. ఈ రెండింటిని మినహాయించి గత ఐదారేళ్లలో ఏ పర్యాటక జట్టు మంచి ఫలితాలు సాధించిందో నాకు చూపండి? అయినా, భారత్‌నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?
ఆ ఓటములపై మాట్లాడుకున్నాం...
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో పరాజయాలపై నేను, కోహ్లి జట్టుతో చర్చించాం. అవకాశాలను ఒడిసిపట్టడంపై మాట్లాడుకున్నాం. ఆ సిరీస్‌ల ఫలితాల గణాంకాలను చూస్తే మా వాస్తవ ప్రదర్శన తెలియదు. కొన్ని టెస్టుల్లో తీవ్రంగా పోరాడాం. పెద్ద పెద్ద అనుకూలతలను చేజార్చుకున్నాం. అవి చివరకు సిరీస్ కోల్పోయేలా చేశాయి.
ఆసీస్ శకం ముగియలేదు...
సంక్షోభాలు ఎదురైనంత మాత్రాన క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ముగిసిందనుకోలేం. క్రీడా సం స్కృతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. సొంతగడ్డపై ఏ జట్టునూ బలహీనమైనదిగా చెప్పలేం. ముగ్గురు నలుగురు కీలక ఆటగాళ్లు లేకున్నా, భారత్‌లో భారత్ ను తక్కువగా చూడలేం కదా? ఇదీ అం తే. అయినా, మేమేమీ బంధించి ఉన్నవారితో ఆడేందుకు వెళ్లడం లేదు. ఇతర విషయాల కంటే మా ఆట పైనే దృష్టిసారించి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం.
పేసర్లు, పాండ్యా గురించి...
గత అనుభవాలతో ఇక్కడి పిచ్‌లపై బౌలింగ్ చేయడాన్ని భారత పేసర్లు ఆస్వాదిస్తారు. కాకపోతే, ఫిట్‌గా ఉండటం ముఖ్యం. ప్రత్యర్థుల బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందనే దానికంటే వారు స్థిరంగా రాణిస్తున్నారు. ఏదో ఒక స్పెల్‌లో కాకుండా, నాలుగైదు గంటల పాటు ఒత్తిడి కొనసాగిస్తే ఫలితం ఉంటుంది. ఆల్ రౌండర్‌గా జట్టుకు సమతూకం తెచ్చిన హార్దిక్ పాండ్యా సేవలను మాత్రం కోల్పోతున్నాం. అతడుంటే అదనపు బౌలర్‌ను తీసుకునే అవకాశం చిక్కేది. పేసర్లు రాణిస్తే హార్దిక్ లేని ప్రభావం కనిపించదు.
మాటపై ఆటే గెలుస్తుంది...
మెక్‌గ్రాత్ లేదా వార్న్ ఏం మాట్లాడారనేది కాదు... మైదానంలో చివరకు క్రికెటే గెలుస్తుంది. ఏ జట్టు తరఫునైనా సరే, నీవు చేయగలిగింది చేస్తుంటే మిగతా విషయాలు పక్కకు పోతాయి. ఆటగాడికైనా, జట్టుకైనా ఇదే వర్తిస్తుంది.
అతడు పరిణితి చెందాడు...
ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లి ఇష్టపడతాడు. తన శైలి బ్యాటింగ్‌కు ఇక్కడి పిచ్‌లు సరిపోతాయి. గత పర్యటనలో భారీగా పరుగులు చేశాడు. ఒకసారి ఇక్కడ రాణించినవారు మళ్లీ వచ్చి చెలరేగాలని కోరుకుంటారు. అతడు ప్రొఫెషనల్, పరిణితి చెందిన ఆటగాడు. ఇదంతా బాధ్యతల రీత్యా అలవడింది. 2014–15లో ఇక్కడ పర్యటించిన తర్వాత జట్టు సారథిగా ఉంటూనే ప్రపంచవ్యాప్తంగా పరుగులు చేశాడు. తన పాత్రను సమర్థంగా పోషిస్తున్న కోహ్లి... అనవసర విషయాల్లో తలదూర్చడు. నేనూ చాలాసార్లు ఆస్ట్రేలియా వచ్చా. ఈ దేశ ప్రజల క్రీడా స్ఫూర్తి ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment