అదేమన్నా సూపర్ మార్కెట్టా?: రవిశాస్త్రి
అడిలైడ్: సూపర్ మార్కెట్ తరహాలో అనుభవానికి పెద్ద పీట వేయడం ఒక క్రికెట్ జట్టులో కుదరని అంశమని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. త్వరలో భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు సీనియర్ ఆటగాళ్లైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రాలను ఎంపిక చేస్తారా? అన్న ప్రశ్నకు రవిశాస్త్రి వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సూపర్ మార్కెట్ మాదిరి అనుభవాన్ని కొనుగోలు చేయడం సాధ్యపడదన్నాడు. ఆ సమయానికి వారు సరైన ఫిట్ నెస్ తో ఉంటే తప్పకుండా జట్టులో ఉంటారన్నాడు.
ఐసీసీ ట్వంటీ 20 వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు ట్వంటీ 20 సిరీస్ కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ఇక్కడ్నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ తమకు ముఖ్యమేనని, అలాగే ట్వంటీ 20 వరల్డ్ కప్ కూడా తమకు మిక్కిలి ప్రాధాన్యతతో కూడుకున్నదని పేర్కొన్నాడు. పలు రకాలైన ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇవ్వడమే తమ ఉద్దేశమని, అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేసి వారిలో సరైన కాంబినేషన్ ను ఎంచుకుంటామన్నాడు. అప్పుడు సీనియర్ , జూనియర్ అనే తేడానే ఉండదని రవిశాస్త్రి తెలిపాడు.