ప్రయోగాలకు వేళాయె!
♦ మార్పులపై కెప్టెన్ కోహ్లి దృష్టి
♦ రిషభ్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చోటు?
♦ నేడు వెస్టిండీస్‌తో నాలుగో వన్డే
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు ఇక ప్రయోగాలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మిడిలార్డర్‌లో తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో పరీక్షించుకోవాల్సి ఉంది. ఇప్పటికే మూడో ఓపెనర్‌గా ఉన్న రహానే భీకర ఫామ్‌ను చాటుకుంటుండటంతో మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. అలాగే ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ కూడా దక్కించుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): ఏ మాత్రం పోటీనివ్వలేకపోతున్న ప్రత్యర్థి వెస్టిండీస్‌పై తమ ప్రయోగాలకు ఇదే సరైన అవకాశమని భారత జట్టు భావిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయం కూడా ఇలాగే ఉండటంతో.. నేడు (ఆదివారం) వెస్టిండీస్‌తో జరిగే నాలుగో వన్డేలో ఏదో ఒక మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక జట్టుకు ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ ఖాయమవుతుంది. మరో మ్యాచ్ కూడా మిగిలి ఉండటంతో రిజర్వ్ బెంచ్‌ను బరిలోకి దింపాలని కెప్టెన్ భావిస్తున్నాడు. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి కావడంతో విండీస్ తమ స్థాయికి మించి ఆడి ఏమేరకు ఆడుతుందో వేచి చూడాలి..
రిషభ్ ఖాయమేనా?
2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే ధోని, యువరాజ్‌లలో ఒక్కరికే చోటు ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ ఇదే నిజమైతే జట్టు ఇప్పటి నుంచే తమ మిడిలార్డర్‌ను పటిష్ట పరచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా యువ సంచలనం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని తుది జట్టులో తీసుకునే ఆలోచనలో కెప్టెన్ ఉన్నాడు. రిషభ్ ఇప్పటిదాకా వన్డేలు ఆడలేదు. భవిష్యత్ తారగా పిలుచుకుంటున్న అతడికి తగిన అంతర్జాతీయ అనుభవం కావాల్సి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతనికే ఎక్కువ అవకాశాలున్నాయి. పేలవ ఫామ్‌తో ఉన్న యువరాజ్ మూడో వన్డేలో కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడి స్థాయికి అది తక్కువే. ధోని మరోసారి తన బ్యాటింగ్‌లో చమక్కులు చూపించాడు. ఓపెనింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్‌లతో పాటు పేసర్లలో భువనేశ్వర్, ఉమేశ్ మెరుస్తున్నారు.
జట్లు: (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, ధోని, యువరాజ్/రిషభ్, జాదవ్, పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్.
విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, కైల్ హోప్, షాయ్ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్.
సా. 6.30 నుంచిసోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం