'ఛాన్స్'ను వదిలేశాం: దినేశ్ కార్తీక్
జమైకా: వెస్టిండీస్ తో ఇక్కడ ఆదివారం జరిగిన ఏకైక ట్వంటీ 20లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 190 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసినప్పటికీ, దాన్ని కాపాడుకోవడంలో విఫలమై ఓటమి చవిచూసింది. దాంతో విండీస్ టూర్ ను విజయంతో ముగించాలనుకున్న భారత్ జట్టుకు నిరాశే మిగిలింది. అయితే తమ ఘోర ఓటమికి క్యాచ్లను నేలపాలు కావడమేనని అంటున్నాడు నిన్నటి మ్యాచ్ లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన దినేశ్ కార్తీక్.
ప్రధానంగా లూయిస్ ఇచ్చిన క్యాచ్లను పట్టుకోవడంలో విఫలమైన కారణంగానే తగిన మూల్యం చెల్లించుకున్నామన్నాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివర బంతికి లూయిస్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లి, మొహ్మద్ షమీల సమన్వయ లోపంతో వదిలేస్తే, ఆపై నాలుగు బంతుల వ్యవధిలో అతనే ఇచ్చిన మరో ఛాన్స్ ను తాను జారవిడిచినట్లు కార్తీక్ పేర్కొన్నాడు. లాంగాఫ్ లో లూయిస్ ఇచ్చిన క్యాచ్ ను పట్టడంలో తాను విఫలమైనట్లు తెలిపిన కార్తీక్.. సరైన స్థానంలో లేకపోవడం కారణంగానే క్యాచ్ ను అందుకోలేకపోయానంటూ స్పష్టం చేశాడు. ఈ రెండు ఛాన్స్ లే మ్యాచ్ పై ప్రభావం చూపయన్నాడు. ఆ తరువాత లూయిస్ విజృంభించి ఆడటంతో మ్యాచ్ ను విండీస్ సునాయాసంగా దక్కించుకుందన్నాడు.
భారత్ విసిరిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లూయిస్ ప్రధాన పాత్ర పోషించాడు. 62 బంతుల్లో 12 సిక్సర్లు, 6 ఫోర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.