మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
‘సాక్షి’కి రానున్న వరల్డ్‌కప్ ట్రోఫీ
ఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్‌కు రానుంది. ప్రొటెక్టెడ్ కంటైనర్‌లో సాక్షి ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్‌కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.
ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా కూడా సాక్షి ఆఫీస్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్‌కు విచ్చేయనుంది.
కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది.
తొలిసారి ఉగాండ..
టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్‌ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment