టీ20 ప్రపంచకప్-2024 పొట్టి క్రికెట్ ప్రేమికులకు భిన్నమైన అనుభవాన్ని అందించింది. ఈ ఐసీసీ టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.
ఫలితంగా పరుగుల ప్రవాహానికి బదులు వికెట్ల జాతర జరిగింది. న్యూయార్క్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నసావూ కౌంటీ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్ వల్ల మ్యాచ్‌లన్నీ.. టీ20 ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా జరిగాయనే చెప్పవచ్చు.
ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం. అయితే, మరో వేదిక వెస్టిండీస్‌లో మాత్రం మెరుగైన స్కోర్లు నమోదయ్యాయి.
ఇక ఐసీసీ ఈవెంట్లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ కి సంబంధించిన సంచలన వార్త తెరమీదకు వచ్చింది.
ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?
ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి నష్టాన్ని మిగిల్చిందని దాని సారాంశం. క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడం వల్ల దాదాపు రూ. 167 కోట్ల(భారత కరెన్సీలో) నష్టం వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
ఈ విషయం గురించి ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చకు రానుందని తెలిపింది. కొలంబో వేదికగా శుక్రవారం ఈ మీటింగ్ జరుగనుంది.
అయితే, వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చింననున్న తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఈ పాయింట్ లేకపోయినా.. పోస్ట్ ఈవెంట్ రిపోర్టుకు సంబంధించిన నివేదిక మాత్రం తయారు చేసినట్లు పీటీఐ పేర్కొంది.
కొత్త చైర్మన్ ఎవరు?
ఇక ఈ ఈవెంట్లో ప్రధానంగా ఐసీసీ కొత్త చైర్మన్ నియామకం గురించి కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని పీటీఐ వెల్లడించింది. గ్రెగ్ బార్‌క్లే స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా నియామకం, దాని పర్యావసనాల గురించి చర్చ జరుగనున్నట్లు పేర్కొంది.
అదే విధంగా.. ఐసీసీ చైర్మన్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి అత్యధికంగా మూడు దఫాలు రెండేళ్ల చొప్పున కొనసాగవచ్చు. అయితే, తాజాగా దీనిని రెండు దఫాలు.. మూడేళ్ల చొప్పున కొనసాగేట్లు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే జట్టుకు దూరం!
Comments
Please login to add a commentAdd a comment