T20 WC: విండీస్‌ ఓపెనర్‌ విధ్వంసం.. అమెరికా చిత్తు | West Indies defeated United States of America by nine wickets at T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 WC: విండీస్‌ ఓపెనర్‌ విధ్వంసం.. అమెరికా చిత్తు

Published Sat, Jun 22 2024 9:39 AM | Last Updated on Sat, Jun 22 2024 11:16 AM

T20 WC 2024 Super 8: West Indies Crush USA By 9 Wickets Semis Hopes Alive

టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8లో వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లలో.. గ్రూప్‌-2లో భాగమైన వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది.

ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్‌ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌.. అమెరికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

చెలరేగిన బౌలర్లు
అయితే, విండీస్‌ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్‌ టేలర్‌(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్‌ గౌస్‌ 29 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎన్‌ఆర్‌ కుమార్‌ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.

మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్‌ అయింది.

వెస్టిండీస్‌ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్‌ మూడు, అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోస్టన్‌ చేజ్‌(3/19) పొదుపుగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్‌ మోటికి ఒక వికెట్‌ దక్కింది.

ఆకాశమే హద్దుగా 
ఇక లక్ష్య ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

మరో ఓపెనర్‌ జాన్సన్‌ చార్ల్స్‌ 15, నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాయీ హోప్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

విండీస్‌ సెమీస్‌ ఆశలు సజీవం
షాయీ హోప్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్‌ నెట్‌ రన్‌రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. 

గ్రూప్‌-2 టాపర్‌ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్‌ రన్‌టేరు +0.625), ఇంగ్లండ్‌(2 పాయింట్లు, నెట్‌ రన్‌రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది.  సెమీస్‌ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్‌...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement