ఇంగ్లండ్‌పై 7 పరుగులతో విజయం
చెలరేగిన డికాక్, రాణించిన బౌలర్లు
గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో శుక్రవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే అమెరికాను ఓడించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
డికాక్ దూకుడుతో పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేసిన సఫారీ టీమ్ ఆ తర్వాత తడబడింది. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తర్వాతి 84 బంతుల్లో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 46 పరుగులు చేయాల్సి ఉండగా... బార్త్‌మన్ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 18 బంతుల్లో 25గా మారింది. బ్రూక్, లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉండటంతో పాటు చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ గెలిచే స్థితిలో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్సెన్, నోర్జే ఒక్కసారిగా ఆటను మార్చేశారు. తర్వాతి 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చారు. దాంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment