అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యం..
పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా లో స్కోరింగ్ మ్యాచ్‌లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్.
👉తొలి మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా.. నమోదైన స్కోర్లు.. 77 (19.1), 80/4 (16.2). ఆరు వికెట్ల తేడాతో లంకపై సౌతాఫ్రికా విజయం.
👉రెండో మ్యాచ్‌లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్.. స్కోర్లు 96 (16), 97/2 (12.2).. ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.
👉ముచ్చటగా మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడ్డ కెనడా.. స్కోర్లు 137/7 (20)- 125/7 (20). 12 పరుగుల తేడాతో కెనడా గెలుపు.
👉ఇక నాలుగో మ్యాచ్ నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మధ్య. ఇది కూడా లో స్కోరింగ్ మ్యాచే! నెదర్లాండ్స్ 103 రన్స్ చేస్తే.. సౌతాఫ్రికా 106 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
👉ఐదో మ్యాచ్.. వరల్డ్‌కప్‌కే హైలైట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఇండియా 119 పరుగులకు ఆలౌట్ అయితే.. పాక్ 113 పరుగుల వద్దే నిలిచి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
👉ఆ తర్వాత సౌతాఫ్రికా(113/6)తో బంగ్లాదేశ్(109/7) తలపడగా.. ప్రొటిస్ జట్టు బంగ్లాపై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.
👉ఏడో మ్యాచ్‌లో కెనడా- పాకిస్తాన్ పోటీపడగా.. 106 పరుగులకే పరిమితమైన కెనడా.. 107 పరుగులు(17.3 ఓవర్లలో) చేసిన పాక్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.
ఇదే ఆఖరు.. కూల్చేయడమే తరువాయి
ఇక ఆఖరిసారిగా ఇక్కడ ఆతిథ్య అమెరికా జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గ్రూప్-ఏ లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే మ్యాచే ఇక్కడ జరిగే చివరి మ్యాచ్. ఆ తర్వాత దీనిని కూల్చేస్తారు.
అవును.. మీరు విన్నది నిజమే. ఇదంతా న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించే! టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
20 జట్లు.. తొమ్మిది వేదికలు
వెస్టిండీస్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్‌ఏలో మూడు వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తైన తర్వాత దీనిని డిస్‌మాంటిల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
పెదవి విరిచిన ప్రేక్షకులు
అయితే, డ్రాప్- ఇన్ పిచ్ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్ ఆపిల్ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!
టీ20 ప్రపంచకప్-2024లో మొత్తం 20 జట్లు భాగం కాగా.. అమెరికాలో మూడు, వెస్టిండీస్(గయానా, బార్బడోస్, ఆంటిగ్వా, ట్రినిడాడ్, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా)లోని ఆరు నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇస్తున్నాయి.
చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా?
Comments
Please login to add a commentAdd a comment