PC: ICC
మెగా క్రికెట్ ఈవెంట్ టీ20 ప్రపంచకప్-2024 కోసం టీమిండియా సహా ఇతర జట్లన్నీ సంసిద్ధమైపోయాయి. పొట్టి ఫార్మాట్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈసారి ఈ ఐసీసీ టోర్నీకి అమెరికా తొలిసారిగా వెస్టిండీస్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది.
అదే విధంగా.. ఎన్నడూలేని విధంగా ఈసారి 20 జట్లు ఈసారి వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాయి. మరి.. ప్రపంచకప్-2024 ఏ ఫార్మాట్లో జరుగనుంది? ఏ జట్లు ఏ గ్రూప్‌లో ఉన్నాయి? గ్రూప్ స్టేజీలో విజేతలను ఎలా నిర్ణయిస్తారు? సూపర్ ఓవర్ రూల్, రిజర్వ్‌డే సంగతేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
నాలుగు గ్రూపులు
టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్‌ఏ, ఐర్లాండ్, కెనడా
👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా
👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.
గెలిస్తే ఎన్ని పాయింట్లు?.. గ్రూప్ స్టేజీ విజేతలను ఎలా నిర్ణయిస్తారు?
👉గ్రూప్ దశలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. తమ గ్రూపులో ఉన్న నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది.
👉ఇందులో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి.
👉కాగా గెలిచిన జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరతాయి. మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది.
👉గ్రూప్ దశలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు వస్తే నెట్ రన్‌రేటు ఎక్కువగా ఉన్న జట్టు టోర్నీలో ముందుకు సాగుతుంది.
👉అయినప్పటికీ రెండు లేదంటే అంతకంటే ఎక్కువ జట్లు గనుక సమానంగా నిలిస్తే ముఖాముఖి పోరులో ఎవరు విజయం సాధించారన్న అంశం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.
సూపర్ ఓవర్ రూల్?
ఏదేని మ్యాచ్ గనుక టై అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. రెండు సమానంగా నిలిస్తే గనుక ఫలితం తేలేదాకా సూపర్ ఓవర్ నిర్వహిస్తూనే ఉంటారు.
సూపర్-8 దశకు చేరాలంటే అర్హతలు?
గ్రూప్ దశలోని నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. సూపర్-8లో ఒక గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి.
సెమీ ఫైనల్ చేరాలంటే?
👉సూపర్-8 దశలో రెండు గ్రూపుల్లో ఉన్న టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి.
👉గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య మొదటి సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందుకు ట్రినిడాడ్ వేదిక.
👉గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందుకు గయానా వేదిక.
ఆటంకాలు ఎదురైతే..
వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే.. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం ఐదు ఓవర్ల పాటు ఆడినా ఫలితం తేల్చే వీలుంటుంది.
సెమీ ఫైనల్, ఫైనల్లో మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం పది ఓవర్ల పాటు ఆడాలి.
రిజర్వ్ డే సంగతేంటి?
👉తొలి సెమీ ఫైనల్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. రెండో సెమీ ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు.
👉అయితే, రెండు సెమీ ఫైనల్స్‌లో ఆటంకాలు ఎదురైతే విజేతలను తేల్చే క్రమంలో అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు.
👉జూన్ 26 నాటి తొలి సెమీ ఫైనల్‌కు ఆరోజు 60 నిమిషాలు, మిగతా రోజు ఆట కొనసాగించేందుకు 190 నిమిషాలు ఇస్తారు.
👉జూన్ 27 నాటి రెండో సెమీ ఫైనల్‌కు అదనంగా ఆరోజు అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు. ఇక జూన్ 29 నాటి ఫైనల్‌కు జూన్ 30 రిజర్వ్ డే.
👉రిజర్వ్ డే ఫలితం తేల్చే క్రమంలో ఇరుజట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ఓవర్ రేటు రూల్?
ఓ జట్టు గంట వ్యవధిలో కనీసం 14.1 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్లో ఓవర్ రేటు కింద జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే, ఆటగాళ్లు తీవ్రమైన గాయాల బారిన పడినపుడు, వైద్య బృందం మైదానంలో చికిత్స చేసినపుడు.. లేదంటే థర్డ్ అంపైర్ రివ్యూ విషయంలో సమయం తీసుకున్నపుడు, బ్యాటింగ్ జట్టు సమయం వృథా చేసినపుడు, మన ఆధీనంలో లేని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు వెసలుబాటు ఉంటుంది.
చదవండి: T20 WC: నో రిజర్వ్ డే! ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
Comments
Please login to add a commentAdd a comment