తమ ఆటగాళ్ల తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ ఖాన్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు కారణమైన కొందరు సీనియర్ క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు అతడు సిద్దమైనట్లు తెలుస్తోంది.
పాక్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని మొహ్సిన్ ఖాన్ సన్నిహిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి.
‘‘త్వరలోనే కొంద మంది సీనియరల్ లెవల్ అధికారులకు స్వస్తి పలికేందుకు పీసీబీ సిద్ధమవుతోంది. అదే విధంగా భవిష్యత్తులో కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించాలనే యోచనలో ఉంది.
చాలా మంది క్రికెటర్లు తమ భార్యాపిల్లల్ని మాత్రమే కాదు.. తమ తల్లిదండ్రులు, సోదరులు.. ఇతర బంధువర్గాన్ని కూడా తమతో పాటు విదేశాలకు తీసుకువెళ్లడమే గాకుండా.. టీమ్ హోటల్‌లోనే ఉంచారు.
ఈ విషయం పట్ల చైర్మన్ పూర్తి అసంతృప్తితో ఉన్నారు. దీనికంతటికి కారణమైన సీనియర్ ఆఫీసర్లపై వేటు వేయాలని ఆయన యోచిస్తున్నారు.
కేవలం టీ20 ప్రపంచకప్-2024లో పరాజయాల పట్ల మాత్రమే కాదు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో కూడా వెనుకబడటం పట్ల చైర్మన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రపంచకప్-2024లో అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచినా సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.
దీంతో బాబర్ ఆజం బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ టోర్నీ అన్న శ్రద్ధ లేకుండా కుటుంబాలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్లినట్లు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్లు చీవాట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ భాగమైన గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment