‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!
ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.
ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.
ఏం జరిగినా అంతా ఓపెన్‌గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో వైఫల్యం తర్వాత
పాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.
గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.
అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.
గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్‌పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.
అందరి ప్లేస్‌లో నేను ఆడలేను కదా!
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు.
కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు.
వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.
చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment