IND vs PAK: ఒక్క టికెట్‌ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్‌ మోదీ ఫైర్‌ | Lalit Modi Blasts ICC: Is $20000 Per Seat For Ind vs Pak T20 WC 2024 Match | Sakshi
Sakshi News home page

IND vs PAK: ఒక్క టికెట్‌ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్‌ మోదీ ఫైర్‌

Published Thu, May 23 2024 5:55 PM | Last Updated on Thu, May 23 2024 6:25 PM

Lalit Modi Blasts ICC: Is $20000 Per Seat For Ind vs Pak T20 WC 2024 Match

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్‌ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్‌ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజే
ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్‌ మ్యాచ్‌లన్నీ యూఎస్‌ఏలోనే ఆడనుంది. జూన్‌ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ద్వారా తాజా ఎడిషన్‌లో‌ తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్‌ సేన.. జూన్‌ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సృష్టికర్త, మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ మండిపడ్డాడు.

లాభాలు దండుకోడానికి కాదు
ఇండియా- పాక్‌ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో డైమండ్‌ క్లబ్‌ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.

అమెరికాలో వరల్డ్‌కప్‌ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్‌ మోదీ ఎక్స్‌ వేదికగా విమర్శించాడు. 

దాదాపు రూ. 16 లక్షలకు పైనే!
కాగా 20 వేల అమెరికన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్‌ మోదీ ట్వీట్‌ చూసిన ఫ్యాన్స్‌ టికెట్‌ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.

కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను సృష్టించిన లలిత్‌ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement