దాయాదులు టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులు నువ్వా- నేనా అన్నట్లు పోటీపడితే చూడాలని కోరుకుంటారు ఇరు దేశాల అభిమానులు. తామూ ఈ జాబితాలో భాగమే అంటున్నారు ఢిల్లీ పోలీసులు.
టోర్నీ ఏదైనా భారత్- పాక్ మ్యాచ్ అంటే తమకూ ఆసక్తేనని.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం అసలైన మజా అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ సేన చేతిలో మరోసారి పరాభవం పాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా ట్రోల్ చేసింది ఢిల్లీ పోలీస్ విభాగం.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 119 పరుగులకు ఆలౌట్ అయింది.
అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 113 పరుగులకే పాక్ కథ ముగియగా.. టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు(7) గెలుపొందిన తొలి జట్టుగా నిలిచింది.
ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే గెలుపోటములు మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగం తమ ఎక్స్ ఖాతాలో న్యూయార్క్ పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసింది.
‘‘హే.. న్యూయార్క్ సిటీ పోలీస్. మాకు రెండు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఒకటి.. ‘ఇండియా.. ఇండియా!’.. రెండోది.. బహుశా టీవీలు పగిలిన శబ్దం అనుకుంటా. నిజమో కాదో కాస్త చెప్తారా?’’ అంటూ ఢిల్లీ పోలీస్ విభాగం చమత్కరించింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇప్పటికే ఈ టోర్నీలో పసికూన యూఎస్‌ఏ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. తాజాగా టీమిండియా చేతిలోనూ ఓడిపోవడంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బాబర్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.
Hey, @NYPDnews
We heard two loud noises. One is "Indiaaa..India!", and another is probably of broken televisions. Can you please confirm?#INDvsPAK#INDvPAK#T20WorldCup— Delhi Police (@DelhiPolice) June 9, 2024
Comments
Please login to add a commentAdd a comment