సిగ్గు... సిగ్గు... | Dhoni takes responsibility for failed chase | Sakshi
Sakshi News home page

సిగ్గు... సిగ్గు...

Published Thu, Jan 21 2016 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

సిగ్గు...  సిగ్గు...

సిగ్గు... సిగ్గు...

నాలుగో వన్డేలో భారత్ అనూహ్య పరాజయం
25 పరుగులతో ఆసీస్ గెలుపు
పనికి రాని కోహ్లి, ధావన్ సెంచరీలు
ఆఖరి వన్డే శనివారం

76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 72, రన్‌రేట్ ఆరుకంటే తక్కువ, చేతిలో 9 వికెట్లు...ఈ స్థితిలో ఏ జట్టయినా మ్యాచ్ ఓడిపోతుందా..! పటిష్ట జట్లతో తలపడినా పసి కూనలు కూడా సంచలనం కోసం పట్టుదలగా ఆడతాయి. కానీ భారత స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం బొక్కబోర్లా పడిపోయారు. 46 పరుగుల వ్యవధిలో అన్ని వికెట్లూ చేజార్చుకొని ఓటమిని కావలించుకున్నారు.  ఫించ్ సెంచరీ, వార్నర్ మెరుపులతో ఆస్ట్రేలియా ఏకంగా 349 పరుగుల కొండలాంటి లక్ష్యం భారత్ ముందుంచింది. ఫామ్‌లోకి వచ్చిన ధావన్, ఫామ్ అంటిపెట్టుకునే ఉన్న కోహ్లి శతకాల మోతతో స్కోరును 277 పరుగుల దాకా తెచ్చాక ఇక గెలుపు ఖాయమనిపించింది. కానీ భారత్ చేతకానితనం, ఆసీస్ పోరాటం కలిసి ఫలితాన్ని మనకు వ్యతిరేకంగా మార్చి పడేశాయి.

 కాన్‌బెర్రా: కచ్చితంగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో ధోని సేన భంగపడింది. గత మూడు వన్డేలలో 300 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయిన టీమిండియా ఈసారి అంతకంటే భారీ స్కోరును ఛేదించే ప్రయత్నం చేసినా... చివరకు ఓటమి తప్పలేదు. బుధవారం ఇక్కడి మనుకా ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (107 బంతుల్లో 107; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, డేవిడ్ వార్నర్ (92 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. ఇషాంత్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (113 బంతుల్లో 126; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (92 బంతుల్లో 106; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 177 బంతుల్లోనే 212 పరుగులు జోడించడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ రిచర్డ్సన్ (5/68) కీలక వికెట్లు తీసి భారత్‌ను పడగొట్టాడు. తాజా ఫలితంతో సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 4-0కు చేరగా... చివరి వన్డే శనివారం జరుగుతుంది.

 ఆసీస్‌కు శుభారంభం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ శుభారంభం ఇచ్చారు. భువనేశ్వర్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన వార్నర్... ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో మరో మూడు బౌండరీలు కొట్టాడు. కొద్ది సేపటికి జడేజాకు కూడా ఇదే ఫలితాన్ని అతను రుచి చూపించాడు. మరో వైపు ఫించ్ కూడా జోరు పెంచాడు. భువీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 పరుగులు రాబట్టాడు.

 చివరకు వార్నర్‌ను ఇషాంత్ బౌల్డ్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరోవైపు 97 బంతుల్లో ఫించ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్మిత్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇదే జోరును కొనసాగించాడు. స్మిత్, మిషెల్ మార్ష్ (33) కలిసి 7 ఓవర్లలో 67 పరుగులు జత చేశారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇషాంత్ వేసిన 50వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియా చివరి 10 ఓవర్లలో 111 పరుగులు చేసింది.

 చెలరేగిన ధావన్, కోహ్లి
ఆసీస్ స్పిన్నర్ లయోన్‌తో బౌలింగ్ ప్రారంభించగా భారత్ అతని 2 ఓవర్లలోనే 23 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభం చేసింది. మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రిచర్డ్సన్ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాది అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో జత కలిసిన ధావన్, కోహ్లి ఆసీస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు.

  చక్కటి షాట్లు ఆడుతూ, అవసరమైన చోట ధాటిని పెంచుతూ, బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. 92 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం వంద పరుగులకు చేరింది.  ఈ క్రమంలో ముందుగా 92 బంతుల్లో ధావన్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత  కోహ్లి 84 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం భారత్ పతనానికి ధావన్ వికెట్‌తో హేస్టింగ్స్ శ్రీకారం చుట్టాడు.

 ఆ దశలో...
37.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు 277/1...తర్వాతి బంతిని కట్ చేయబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ధావన్ క్యాచ్ ఇచ్చాడు. అయితే మరో మూడు బంతులకు ధోని (0) అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి ధోని కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

 మరో పరుగు తర్వాత అనవసరపు షాట్‌కు ప్రయత్నించి కోహ్లి మిడాఫ్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్మిత్ అందుకోవడంతో ఆ జట్టులో ఉత్సాహం పెరిగింది. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా మరో అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్‌ను చుట్టేసింది. ‘తప్పనిసరి’ అయితేనే బరిలోకి దిగుతానని చెప్పిన రహానే (2) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. అయినా అతనూ ఓటమిని తప్పించలేకపోయాడు.

 18ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఇది వరుసగా 18వ విజయం.

 4 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి (25 సెంచరీలు) చేరుకున్నాడు. సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28) అతనికంటే ముందుండగా...సంగక్కర కూడా 25 సెంచరీలే చేశాడు.

 నిర్లక్ష్యానికి పరాకాష్ట!
ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోవడం ఇవాళ కొత్తేం కాదు. ఆ మాట కొస్తే ఆస్ట్రేలియాలో వారం రోజుల్లో మూడు వన్డేలు ఓడిపోయారు. సిరీస్ ఓడిపోయిన తర్వాత నాలుగో మ్యాచ్ గెలిస్తే ఎంత? గెలవకపోతే ఎంత? కానీ సగటు భారత క్రికెట్ అభిమాని ఎవరైనా సరే ఈ మ్యాచ్ చూస్తే బాధతో తల్లడిల్లిపోతాడు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న అభిమాని ఆనందాన్ని కేవలం అరగంటలో ఆవిరి చేశారు.

రోహిత్ శర్మ సంచలన షాట్లతో అద్భుతమైన ఆరంభాన్ని అందించాక... శిఖర్ ధావన్, కోహ్లి తమ కెరీర్‌లోనే గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ షాట్లు ఆడిన తీరు చూస్తే లక్ష్యం నాలుగొందలైనా ఊదిపారేయొచ్చని అనిపించింది. 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 37వ ఓవర్ ముగిసేసరికి 274 పరుగులు చేసింది. అంటే ఇక 78 బంతుల్లో 75 పరుగులు చేస్తే గెలుస్తాం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

ఇలాంటి స్థితిలో మ్యాచ్ పోగొట్టుకునే జట్టు ఏదీ ఉండదేమో. ఫామ్‌లో ఉన్న రహానే గాయం కారణంగా బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలియని స్థితి. అందుకే కోహ్లి, ధావన్‌ల అద్భుత భాగస్వామ్యం చూస్తే ముచ్చటేసింది. కానీ బాగా ఆడుతున్న సమయంలో ఏదో ఒక తిక్క షాట్ ఆడి అవుటవ్వడం ధావన్‌కు కొత్తేం కాదు. ఈసారి కూడా అదే చేశాడు. విజయం సాధించేశామనే ధీమాతో నిర్లక్ష్యపు షాట్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

 ఆ షాట్లు ఆడతారా?
ఆస్ట్రేలియా క్రికెటర్లకు చిన్న అవకాశం దొరికితే మ్యాచ్‌ను లాగేసుకుంటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తరఫున ఉత్తమ బౌలర్  హేస్టింగ్స్. తన చివరి ఓవర్లో ధావన్‌తో పాటు ధోనిని కూడా అతను ఆఖరి బంతికి అవుట్ చేశాడు. నిజానికి ఈ ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా ఎవరితో బౌలింగ్ చేయించాలో కూడా తెలియని స్థితి. కానీ ధోని అత్యంత నిర్లక్ష్యంగా ఆడి అవుటయ్యాడు. ఇప్పటికే తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ షాట్ తన కెరీర్ ముగింపును మరింత వేగవంతం చేసినా ఆశ్చర్యం లేదు.

 ఇక ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే కోహ్లి కూడా పేలవంగా ఆడి అవుటయ్యాడు. అప్పటివరకూ ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా కచ్చితమైన షాట్లు ఆడిన కోహ్లి... ఇలాంటి లూజ్ షాట్ ఆడతాడని కనీసం ఊహించలేం. కెప్టెన్‌కే బాధ్యత లేనప్పుడు నాకెందుకు అనుకున్నాడా? లేక దురదృష్టమా? దీనికి సమాధానం కోహ్లి ఒక్కడికే తెలుసు.

 రాత్రికి రాత్రే హీరోలు కాలేరు
రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్. అనుభవం కూడా ఉంది. అందుకే అతను జాగ్రత్తగా ఒక ఎండ్‌లో నిలబడ్డాడు. రహానే కనీసం బ్యాట్ పట్టుకునే స్థితిలో లేకపోయినా వచ్చి ఆడినందుకు అభినందించాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య నాలుగు కుట్లు పడ్డా... పెయిన్ కిల్లర్ తీసుకుని వచ్చి ఆడాడు. కాబట్టి అతని నుంచి పెద్దగా ఆశించడం కూడా తప్పు.

కానీ గుర్‌కీరత్, రిషి ధావన్ అనే ఇద్దరు కొత్త క్రికెటర్లు మాత్రం దారుణంగా నిరాశపరిచారు. ఇద్దరిలోనూ మంచి నైపుణ్యం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద రగొట్టారు. క్రీజులోకి వచ్చాక చక్కటి షాట్లతో చెరో బౌండరీ కూడా కొట్టారు. సింగిల్స్ తీసి జడేజాకు స్ట్రయికింగ్ ఇస్తే పని పూర్తయ్యేది. కానీ రాత్రికి రాత్రే హీరోలు కావాలనే తపనేమో... భారీ షాట్ల కోసం ప్రయత్నించి అవుటయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఆడే కుర్రాళ్లకు భారత జట్టులో చోటు కల్పించడం కూడా అనవసరం.

 ‘తోక’కు ఏమైందో...
టి20 క్రికెట్... ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక బౌలర్లంతా నెట్స్‌లో కొద్దిసేపైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంచరీలు బాదిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌లు కూడా ఏ మాత్రం తెలివి చూపించలేదు. అందరూ భారీ షాట్లకే వెళ్లారు. ఫలితం ఓ ఎండ్‌లో జడేజా బొమ్మలా నిలబడిపోయాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే ఏ క్రికెటర్ అయినా బాధ్యతగా ఆడాలి. ‘ఇలాగే ఆడు’ అని ఎవరూ బొట్టుపెట్టి చెప్పరు.

  ఓ ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతుంటే కనీసం జడేజా వెళ్లి ఎవరినీ గైడ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, డెరైక్టర్ ఏమైనా చెప్పారో లేదో తెలియదు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో కేవలం 25 పరుగుల తేడాతో ఓడిపోవడం పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆడిన తీరు... నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇటీవలి కాలంలోనే అత్యంత చెత్త ప్రదర్శన. పూర్తిగా బాధ్యతారాహిత్యం.
                          -సాక్షి క్రీడావిభాగం

 స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఇషాంత్ 93; ఫించ్ (సి) ఇషాంత్ (బి) ఉమేశ్ 107; మార్ష్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 33; స్మిత్ (సి) గుర్‌కీరత్ (బి) ఇషాంత్ 51; మ్యాక్స్‌వెల్ (సి) (సబ్) పాండే (బి) ఇషాంత్ 41; బెయిలీ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; ఫాల్క్‌నర్ (బి) ఉమేశ్ 0; వేడ్ (రనౌట్) 0; హేస్టింగ్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 348.

 వికెట్ల పతనం: 1-187; 2-221; 3-288; 4-298; 5-319; 6-319; 7-321; 8-348.

 బౌలింగ్: ఉమేశ్ 10-1-67-3; భువనేశ్వర్ 8-0-69-0; ఇషాంత్ 10-0-77-4; గుర్‌కీరత్ 3-0-24-0; రిషి ధావన్ 9-0-53-0; జడేజా 10-0-51-0.

 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 41; శిఖర్ ధావన్ (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 126; కోహ్లి (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 106; ధోని (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 0; గుర్‌కీరత్ (సి) (సబ్) షాన్‌మార్ష్ (బి) లయోన్ 5; జడేజా (నాటౌట్) 24; రహానే (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; రిషి ధావన్ (సి) వార్నర్ (బి) రిచర్డ్సన్ 9; భువనేశ్వర్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; ఉమేశ్ (సి) బెయిలీ (బి) మార్ష్ 2; ఇషాంత్ (సి) వేడ్ (బి) మార్ష్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 323.

 వికెట్ల పతనం: 1-65; 2-277; 3-277; 4-278; 5-286; 6-294; 7-308; 8- 311; 9-315; 10-323.

 బౌలింగ్: లయోన్ 10-0-76-1; రిచర్డ్సన్ 10-1-68-5; హేస్టింగ్స్ 10-2-50-2; ఫాల్క్‌నర్ 7-0-48-0; మార్ష్ 9.2-0-55-2; మ్యాక్స్‌వెల్ 1-0-10-0; స్మిత్ 2-0-16-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement