
కాండీ: హ్యాట్రిక్ ఓటముల అనంతరం శ్రీలంకకో గెలుపు. ఉత్కంఠను అధిగమిస్తూ... దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరిగిన డే నైట్ నాలుగో వన్డేలో ఆ జట్టు 3 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక... షనక (34 బంతుల్లో 65; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డికెవెలా (34), తరంగ (36) శుభారంభం అందించగా... కుశాల్ పెరీరా (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిసారా పెరీరా (45 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. లంక ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఉండగా వర్షం కారణంగా అరగంటపైగా ఆట నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు.
ఛేదనలో సఫారీ ఇన్నింగ్స్ రెండు ఓవర్లు కాగానే మరోసారి వర్షం గంటపైగా ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 21 ఓవర్లలో 191 పరుగులుగా నిర్దేశించారు. దక్షిణాఫ్రికా 21 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా (23 బంతుల్లో 40; 6 ఫోర్లు) జోరుతో దక్షిణాఫ్రికా దీటుగానే ఆరంభించింది. డుమిని (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా జోరు చూపడంతో విజయం తేలికేననిపించింది. అయితే, లంక బౌలర్లు తేరుకుని వరుసగా క్లాసెన్ (17), హెండ్రిక్స్(2), ఫెలూక్వాయో(9)లను పెవిలి యన్‌కు పంపారు. ఓ ఎండ్‌లో మిల్లర్ (21) నిలిచినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో సఫారీలు గెలవాలంటే 8 పరుగులు అవసరం కాగా, లక్మల్ (3/ 46)... మిల్లర్‌ను ఔట్ చేయడంతో పాటు నాలుగే పరుగులు ఇచ్చి లంకను గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment