
దుబాయ్: కెరీర్‌లో తొలి వన్డే ఆడిన ఆబిద్ అలీ (119 బంతుల్లో 112; 9 ఫోర్లు)తో పాటు మొహమ్మద్ రిజ్వాన్ (102 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదం తొక్కినా... పాకిస్తాన్‌ను గెలిపించలేకపోయారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 6 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 4–0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (82 బంతుల్లో 98; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) 2 పరుగులతో సెంచరీని కోల్పోగా... ఓపెనర్ ఖాజా (78 బంతుల్లో 62; 6 ఫోర్లు), క్యారీ (67 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఆబిద్, రిజ్వాన్ మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు పెంచినా ఆబిద్ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. నేడు ఆఖరి వన్డే ఇక్కడే జరుగనుంది.