దంచి కొట్టారు
►సెంచరీలతో చెలరేగిన కోహ్లి, రోహిత్
►నాలుగో వన్డేలో 168 పరుగులతో భారత్ విజయం
నాలుగో వన్డేలో భారత్ మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా రెండో శతకంతో చెలరేగగా కెప్టెన్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించి సిరీస్‌లో తొలిసెంచరీతో అదరగొట్టాడు. దాదాపు 28 ఓవర్ల వరకు సాగిన వీరి విధ్వంసంతో స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. ప్రారంభం నుంచే ఎలాంటి ఆశలు లేకుండా ఆడటంతో భారత్ సునాయాసంగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
కొలంబో: సిరీసే పోయింది.. ఇక ఆడి ఏం లాభం అనుకున్నారేమో లంక ఆటగాళ్లు.. గురువారం జరిగిన నాలుగో వన్డేలో మరింత చెత్తగా ఓడారు. కోహ్లి (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో లంక ముందు కొండంత లక్ష్యం ఏర్పడింది. అయితే కనీస పోరాటమే లేకుండా ఆతిథ్య జట్టు తోకముడిచింది. ఫలితంగా భారత్ 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
ప్రేమదాస స్టేడియంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు సాధించింది. మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, 300వ వన్డే ఆడిన ఎంఎస్ ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 42.4 ఓవర్లలో 207 పరుగులకు
ఆలౌటయ్యింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కోహ్లి నిలిచాడు.
విరాట్, రోహిత్ పరుగుల మోత
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్‌లో ధావన్ (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రోహిత్, కోహ్లి వీరవిహారంతో లంక ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. నాలుగో ఓవర్‌లో కోహ్లి వరుసగా మూడు ఫోర్లతో తన ప్రతాపం చూపెట్టాడు. ఆ తర్వాత కూడా తన వేగం కొనసాగడంతో 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అటు రోహిత్ కూడా 14వ ఓవర్‌లో వరుసగా 4, 6 బాదడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అంతేకాకుండా లంక బౌలర్లపై యథేచ్చగా విరుచుకుపడిన కోహ్లి 76 బంతుల్లో ఓ ఫోర్‌తో సెంచరీని అందుకున్నాడు. 26 ఓవర్లలోనే జట్టు స్కోరు 200కు చేరింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన తను 26వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదినా 30వ ఓవర్‌లో మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే అప్పటికే రెండో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. మరో వైపు రోహిత్ 34వ ఓవర్లో ఫోర్‌తో కెరీర్లో 13వ శతకం అందుకున్నాడు. అయితే ఆ మరుసటి ఓవర్‌లోనే మాథ్యూస్ వరుస బంతుల్లో పాండ్యా (19), రోహిత్‌లను పెవిలియన్‌కు పంపాడు.
రాహుల్ (7) మరోసారి విఫలం కాగా ఇక చివరి 10 ఓవర్లలో మనీష్ పాండే, ధోని జోడి లంక బౌలర్లను ఆటాడుకుంది. ముఖ్యంగా తనకు వచ్చిన అవకాశాన్ని పాండే చక్కగా వినియోగించుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అటు ధోని ఎప్పటిలాగే తన సూపర్ బ్యాటింగ్‌తో అలరించగా ఆరో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు వచ్చాయి. ఇందులో ఆఖరి ఏడు ఓవర్లలోనే 70 పరుగులు చేరాయి.
శ్రీలంక ఎప్పటిలాగే..
ఈ సిరీస్‌లో 200 పరుగులు దాటడానికే ఆపసోపాలు పడుతున్న శ్రీలంక.. ఇక 376 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? శార్దుల్ వేసిన మూడో ఓవర్‌లో డిక్‌వెల్లా వికెట్‌ను భారత్ రివ్యూ ద్వారా సాధించింది. ఆ తర్వాత కూడా లంక ఆటతీరులో మార్పు లేకపోవడంతో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ ఒక్కడే తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. తనకు సిరివర్ధన కొద్దిసేపు సహకారం అందించాడు. వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో సిరివర్ధనను పాండ్యా అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం 38వ ఓవర్‌లో మాథ్యూస్‌ను అక్షర్ అవుట్ చేయడంతో లంక ఆశలు వదిలేసుకుంది.
ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్!
కెరీర్‌లో 300వ వన్డే ఆడిన ధోనిని జట్టు సహచరులు అభినందనలతో ముంచెత్తారు. మ్యాచ్‌కు ముందు టీమ్ తరఫున ఒక ప్రత్యేక జ్ఞాపికను ధోనికి అందజేశారు. ఈ సందర్భంగా కోహ్లి ‘ఈ క్షణం గురించి ఏమని మాట్లాడను. మనలో 90 శాతం మంది అతని నాయకత్వంలోనే జట్టులోకి వచ్చారు. అలాంటి వ్యక్తికి చిరు జ్ఞాపిక అందించడం కూడా గౌరవంగా భావిస్తున్నాం. మా అందరికి ఎప్పటికీ నువ్వే కెప్టెన్‌వి’ అని వ్యాఖ్యానించాడు.
సచిన్ ‘10’ రిటైర్ కాలేదా!
జెర్సీ నంబర్ 10... క్రికెట్ ప్రపంచంలో ఈ అంకె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భారత దిగ్గజం సచిన్ ‘టెన్’డుల్కర్ కెరీర్ ఆసాంతం వాడిన ఈ నంబర్ అతనికి పర్యాయపదంగా మారిపోయింది. సచిన్ రిటైర్ అయిన సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని... భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా ఆ అంకెతో జెర్సీ ధరించడని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. అయితే గురువారం ఆశ్చర్యకరంగా అది మరోసారి మైదానంలో కనిపించింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్ అభిమానులుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 218వ క్రికెటర్‌గా శార్దుల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
►29 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. సచిన్ (49), పాంటింగ్ (30) తనకన్నా ముందున్నారు.
►300 వన్డేల్లో మలింగ వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా 11వ బౌలర్
►73 అత్యధిక సార్లు నాటౌట్ (73)గా నిలిచిన ఆటగాడిగా ధోని రికార్డు