
ఆష్లే నర్స్ బౌలింగ్‌లో 37వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా పంపి సింగిల్ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భారత క్రికెట్‌లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలవడం! 2007 టి20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు, 2010లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించినపుడు, రోహిత్ శర్మ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని అందుకున్నప్పుడు... నాన్ స్ట్రయికర్‌గా ధోనినే ఉండటం విశేషం.
ఇక వీటన్నింటికీ మించినదేమంటే, స్ట్రయికింగ్‌లో ఉండి... 2011 ప్రపంచ కప్ ఫైనల్లో సిక్స్‌తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం. ఆ మ్యాచ్..: వన్డే క్రికెట్‌లో అందరికంటే ముందుగా 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం మాస్టర్ బ్లాస్టర్‌కే సాధ్యమైంది. మార్చి 31, 2001న ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై అతను ఈ ఘనతను నమోదు చేశాడు. భారత్ 118 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో సచిన్ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇది సచిన్ కెరీర్‌లో 28వ సెంచరీ.