యువప్లేయర్‌ను ఆకాశానికి ఎత్తేసిన మాస్టర్
సెంచరీ చేయడానికి సరిగ్గా 3 పరుగుల ముందు ఔటయితే ఎవరికైనా సరే.. దుఃఖం తన్నుకొస్తుంది. అందులోనే ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న ప్లేయర్లయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీ ప్లేయర్ రిషభ్ పంత్ పరిస్థితీ అంతే. గురువారం రాత్రి గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ సరిగ్గా 97 పరుగుల వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. కానీ, ఆ క్షణంలో అతడు బాధపడినా.. ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిన ప్రశంసలు చూసి ఉప్పొంగిపోయి ఉంటాడు. 43 బంతుల్లోనే 97 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌ను ఐపీఎల్‌లో తాను చూసిన అత్యుత్తమమైనవాటిలో ఇదొకటని సచిన్ ట్వీట్ చేశాడు. కేవలం ఈ ఒక్క సీజన్‌లోనే కాదని, ఇప్పటి వరకు జరిగిన 10 సీజన్లలో కూడా ఇదే మంచి ఇన్నింగ్స్ అని మాస్టర్ అన్నాడు. దాంతోపాటు.. ఔటయిన తర్వాత రిషబ్ పంత్ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా టీవీ స్క్రీన్‌ను ఫొటో తీసి ఆ ఫొటో కూడా ట్వీట్ చేశారు.
భారతీయ క్రికెట్‌కు ఆశాజ్యోతిగా క్రీడా పండితులు అభివర్ణిస్తున్న పంత్ ఇన్నింగ్స్ చూసి సచిన్ చాలా ముచ్చట పడ్డాడు. సరిగ్గా సెంచరీ ముంగిట ఉండగా బాసిల్ థంపి ఓ చక్కటి బంతితో పంత్‌ను బోల్తా కొట్టించాడు. అయినా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సురేష్ రైనా కూడా స్వయంగా పంత్ వద్దకు నడుచుకుంటూ వచ్చి, సెంచరీ మిస్సయినందుకు ఓదార్చాడు. చక్కటి ఇన్నింగ్స్ ఆడావంటూ అభినందించాడు కూడా. అయితే.. పంత్ ఇన్నింగ్స్ వృధాగా పోలేదు. జట్టు మెంటార్ రాహుల్ ద్రవిడ్ సహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మరీ తిరిగొస్తున్న పంత్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత కోరీ ఆండర్సన్ ఒక సిక్స్ కొట్టడంతో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్ దశకు చేరుకోడానికి ఈ విజయం ఢిల్లీకి చాలా అవసరం.
One of the best Innings I have seen in the IPL & that includes all 10 seasons. @RishabPant777 pic.twitter.com/SGv3YuXwJ5
— sachin tendulkar (@sachin_rt) 4 May 2017