Rishabh Pant Accident Details: PM Modi, Sachin And Kohli Wish Rishabh Pant Speedy Recovery - Sakshi
Sakshi News home page

Rishabh Pant: తల్లిని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్‌

Published Sat, Dec 31 2022 9:01 AM | Last Updated on Sat, Dec 31 2022 10:11 AM

Rishabh Accident Details: PM Modi Sachin Kohli Wish Speedy Recovery - Sakshi

విరాట్‌ కోహ్లితో పంత్‌ (ఫైల్‌ ఫొటో)

Rishabh Pant Accident Sequence- న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ శుక్రవారం ఉదయం పెను ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలం రూర్కీకి వెళ్తుండగా పంత్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ కారులో మంటలు చెలరేగాయి.

అటువైపు వెళ్తున్న హరియాణా రోడ్‌వేస్‌కు చెందిన బస్‌ డ్రైవర్‌ సుశీల్‌ మాన్‌ ప్రమాద దృశ్యాన్ని చూసి బస్సు ఆపి అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే పంత్‌ కారు కిటికీ అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత సుశీల్‌ సహాయంతో పంత్‌ కారు బయటకు వచ్చాడు.

ఆ వెంటనే పంత్‌ను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారని హరిద్వార్‌ సీనియర్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. ప్రమాద తీవ్రతకు పంత్‌ కారు పూర్తిగా దగ్ధమైంది.

తల్లికి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకుని
తల్లికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్వస్థలం చేరుకొని సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని పంత్‌ స్వయంగా కారు నడుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరాడు. ప్రమాదంలో పంత్‌ నుదురు చిట్లింది. వీపుపై గాయాలయ్యాయి. కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైంది.

ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని... అతని మెదడుకు, వెన్నెముకకు ఎలాంటి గాయాలు కాలేదని ఎంఆర్‌ఐ స్కాన్‌లలో తేలినట్లు బీసీసీఐ తెలిపింది.

బీసీసీఐ ప్రకటన
పంత్‌ చికిత్సకయ్యే ఖర్చులన్నీ తాము భరిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. అయితే పంత్‌ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ కావడంతో చికిత్స ఖర్చులను తాము చెల్లిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. పంత్‌ తొందరగా కోలుకోవాలని జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆకాంక్షించాడు.

ప్రముఖుల స్పందన
భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, పాక్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిది, ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం, హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తదితరులు సోషల్‌  మీడియా వేదికగా స్పందిస్తూ పంత్‌కు ధైర్యం చెప్పారు.

కోహ్లి ట్వీట్‌
అతడు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సైతం.. ‘‘త్వరగా కోలుకో పంత్‌.. నీకోసం ప్రార్థిస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఆరు మ్యాచ్‌ల సిరీస్‌కు పంత్‌ దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు పంత్‌ 33 టెస్టులు ఆడి 2,271 పరుగులు సాధించాడు. 30 వన్డేల్లో, 66 టి20 మ్యాచ్‌ల్లోనూ పంత్‌ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్‌ అలా బతికిపోయింది!
Rishabh Pant Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌! ప్రమాదానికి కారణం అదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement