అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.
ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.
అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.
అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment