కోహ్లిని డిస్టర్బ్ చేసిందెవరు?
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాను ‘గోల్డెన్ డక్’గా అవుటవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ‘మిస్టర్ ఫైర్’ డకౌటయ్యాడు. కౌంటర్-నీలె బౌలింగ్ లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చేతికిలోకి వచ్చిన బంతిని రెండో ప్రయత్నంలో పాండే ఒడిసిపట్టాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కోహ్లి అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. కోపంతో కాలికి కట్టుకున్న ప్యాడ్లపై బ్యాట్ తో బాదుకున్నాడు. డ్రెస్సింగ్ రూమువైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఏం జరిగిందని అంపైర్ అడగ్గా.. ప్రేక్షకుల్లో ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించారని వెల్లడించాడు. సైట్ స్క్రీన్ దగ్గర ఓ వ్యక్తి తచ్చాడుతుండాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు జోక్యం చేసుకుని సైట్ స్క్రీన్ దగ్గర అతడిని పంపించివేయడంతో కోహ్లి శాంతించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ... ‘ ఇక్కడ సైట్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉంది. దాని దగ్గర ఓ వ్యక్తి నిలబడి బౌలర్ లా విన్యాసాలు చేశాడు. దీంతో నా ఏకాగ్రత భంగం కలిగి నేను ఆటపై దృష్టి పెట్టలేకపోయాను. కానీ పెద్ద విషయం కాద’ని కోహ్లి అన్నాడు.