ఐపీఎల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరులు వీరే..
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ నేడు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గతేడాది విన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఓవరాల్ ఐపీఎల్ సీజన్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఖాతాలో 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లున్నాయి. ఇందులో 14 అవార్డులను కేవలం మూడు సీజన్లలో సాధించడం విశేషం.
2011లో ఆరు, 2012లో ఐదు, 2013లో 3 సొంతం చేసుకున్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆ జట్టు తరఫున 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, మొదట్లో ప్రాతినిధ్యం వహించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడిగా ఒక అవార్డు సాధించాడు. 2011, 12 సీజన్లలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన విషయం తెలిసిందే.
2. యూసఫ్ పఠాన్
మొదటి మూడు సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కు, 2011 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యూసఫ్ పఠాన్. రాజస్థాన్ ఆటగాడిగా 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, కేకేఆర్ ఆటగాడిగా 5 అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో రెండో స్థానంలో నిలిచాడు పఠాన్.
3. మైక్ హస్సీ
ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్ తొలి సీజన్లలో పరుగుల వేటలో ముందున్నాడు. ఆపై ఇతడి జోరు తగ్గింది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఓవరాల్ గా 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు హస్సీ ఖాతాలో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై చేసిన సెంచరీ ఇతడి కెరీర్ లో ఎప్పటికీ ప‍్రత్యేకమే.
4. గౌతమ్ గంభీర్
ఐపీఎల్ స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఒకడు. మొదటి మూడు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున, ఆ తర్వాతి నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ ఆటగాడిగా 3, కేకేఆర్ ఆటగాడిగా 8 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు కొల్లగొట్టాడు గంభీర్. 2008, 2012 సీజన్లలో అత్యధిక పరుగుల ఆటగాళ్లతో రెండో స్థానంలో నిలిచాడు.
5. వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ తొలి ఆరు సీజన్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు, ఆ తర్వాతి సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించాడు సెహ్వాగ్. ఢిల్లీ ఆటగాడిగా 10, పంజాబ్ ప్లేయర్ గా ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2008, 2011 సీజన్లలో రెండు చొప్పున, 2012లో మూడు, 2009, 2010, 2013, 2014లలో ఒక్కో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నెగ్గాడు.
6. ఎంఎస్ ధోనీ
గత సీజన్లో నిషేధం పడే వరకూ ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2016లో కొత్త ప్రాచైజీ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఓవరాల్ గా 112 మ్యాచ్ లాడిన ధోనీ 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నెగ్గాడు ధోనీ. 99 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 14 హాఫ్ సెంచరీల సాయంతో 40.84 సగటుతో 2614 పరుగులు చేశాడు.