థంపి.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడు
కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి మీద వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాలో స్థానం సంపాదించుకుంటాడని చెప్పాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో బ్రావో, థంపి ఇద్దరూ గుజరాత్ లయన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. బాసిల్ థంపి చాలా టాలెంట్ ఉన్న కుర్రాడని, దాదాపు ఒక ఏడాది లోపే అతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుందని తనకు నమ్మకం ఉందని బ్రావో అన్నాడు. అతడికి మంచి టాలెంట్‌తో పాటు మంచి హృదయం, పేస్, నైపుణ్యం అన్నీ ఉన్నాయని, ఎప్పుడూ కూడా నేర్చుకోవాలని చూస్తుంటాడని చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో వరుసపెట్టి యార్కర్లు వేసి అందరినీ థంపి బాగా ఇంప్రెస్ చేశాడు.
గుజరాత్ లయన్స్ బౌలర్లందరినీ వరుసపెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఊచకోత కోస్తుంటే.. థంపి మాత్రం కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతడు వేసిన వాటిలో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆర్సీబీ తరఫున 38 బంతుల్లోనే 77 పరుగులు చేసిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో మొట్టమొదటే పెద్ద వికెట్‌ను థంపి తీసినట్లయింది. ముందుగా యార్కర్ వేసి ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. తొడ కండరాల గాయంతో బాధపడి.. ఇప్పుడే కోలుకుంటున్న బ్రావో వెంటనే థంపి వద్దకు వెళ్లి అభినందించాడు. థంపి ఎప్పుడూ సరైన ప్రశ్నలే అడుగుతుంటాడని, ఇలాంటి వాళ్లు ఉంటే భారత క్రికెట్ సరైన దిశలో వెళ్తుందని బ్రావో అన్నాడు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, థంపి లాంటివాళ్లు బౌలింగ్ చేయడం చాలా బాగుందని, వాళ్లకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా థంపి నేర్చుకునే దశలో ఉన్నాడని, మరిన్ని గేమ్స్ ఆడి మరింత అనుభవం పొందితే బాగా రాటుతేలుతాడని తెలిపాడు. గత సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీసిన బ్రావో.. ఈసారి లేకపోవడం గుజరాత్‌ను ఇబ్బంది పెడుతోంది.