యువరాజ్ క్యాచ్ పట్టి ఉంటే..
న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై ఝూలువిదిలిచ్చింది. పటిష్ట సన్ రైజర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై టీమిండియా క్రికెటర్, ఢిల్లీ తాత్కాలిక కెప్టెన్ కరుణ్ నాయర్ హర్షం వ్యక్తంచేశాడు. జట్టులో యువకులు ఉన్నారని, ఎలాంటి భయం లేకుండా ఆడటమే సన్ రైజర్స్‌పై విజయానికి కారణమన్నాడు. 'బౌలర్లు శ్రమించినా సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. యువరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను మా వాళ్లు వదిలేయడంతో వారికి కలిసొచ్చింది. లైఫ్ రావడంతో యువరాజ్ విజృంభించి ఆడాడు. లేకపోతే మాకు విజయం సులువుగా సాధ్యమయ్యేది' అని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు.
'డేర్ డేవిల్స్ పోరాటపటిమతో ఆకట్టుకుంది. 186 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టమని భావించాం. కానీ ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షాలో అద్బుతం చేసింది' అని మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. గాయం కారణంతో ఢిల్లీ పర్మనెంట్ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరం కావడంతో బాధ్యతలు తీసుకున్న కరుణ్ నాయర్ జట్టుకు విజయాన్ని అందించాడు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి మూడో విజయాన్ని నమోదు చేసింది.