ఉత్కంఠపోరులో హైదరాబాద్ విజయం
హైదరాబాద్: ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన పరుగుల పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సన్ రైజర్స్, ఆపై బౌలింగ్‌లో రాణించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ చివరివరకూ పోరాడినా ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్ బౌలర్ కౌల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ తన తొలి ఓవర్లోనే (బిల్లింగ్స్) వికెట్ సాధించాడు. ఓవరాల్‌గా సిరాజ్ రెండు కీలక వికెట్లు తీశాడు.
ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరం కాగా 8 పరుగులిచ్చి వికెట్ తీశాడు. శాంసన్(42), కరుణ్ నాయర్(33), మాథ్యూస్(31) రాణించారు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ(31 బంతుల్లో 50 నాటౌట్) చివరివరకూ పోరాడినా ఢిల్లీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. అంతకుముందు టాస్ నెగ్గిన వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ 4 పరుగులకే మోరిస్ బౌలింగ్ లో మిశ్రాకు క్యాచిచ్చి ఔటయ్యాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ (51 బంతుల్లో 89) వీర విహారానికి, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70) ఇన్నింగ్స్ తోడవడంతో రెండో వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యం లభించింది.
అయితే చివర్లో సన్ రైజర్స్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా హెన్రిక్స్ రెండు ఫోర్లతో 12 పరుగులు, హుడా సిక్స్ కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓ దశలో 200 చేసేలా కనిపించినా.. ఢిల్లీ బౌలర్ క్రిస్ మోరిస్ వరుస బంతుల్లో ధావన్, యువరాజ్‌లను ఔట్ చేసి సన్ రైజర్స్ ను కట్టడి చేశాడు. ధావన్ ఫామ్‌లోకి రావడంతో పాటు విలియమ్సన్ అందుబాటులోకి రావడం సన్ రైజర్స్ జట్టులో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.