షాకింగ్: హైదరాబాద్ కెప్టెన్‌కు గాయం
- మ్యాచ్ తర్వాత వెల్లడించిన వార్నర్
- క్యాచ్ అందుకుంటుండగా పక్కటెముకల్లో గాయం
హైదరాబాద్: బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ లక్ష్యఛేదన సందర్భంగా యువరాజ్‌సింగ్ వేసిన పదో ఓవర్‌లో రిషబ్ పంత్ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్ ప్రమాదకరరీతిలో అందుకున్నాడు. పూర్తిగా వెనుకకు పడిపోతూ ఈ క్యాచ్ ఒడిసిపట్టాడు. ఈ సందర్భంగా అతను బాధ పడుతున్నట్టు కనిపించింది. మ్యాచ్ అయిపోయేవరకు ఈ గాయాన్ని ఓర్చుకున్న వార్నర్.. అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు. రిషబ్ క్యాచ్ సందర్భంగా పక్కటెముకల్లో గాయమైందని వెల్లడించాడు.
కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని డేవిడ్ వార్నర్ ప్రశంసల్లో ముంచెత్తారు. కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో గొప్ప ఆటతీరు కనబర్చారని కితాబిచ్చారు. విలియమ్సన్ 89, ధావన్ 70 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 191 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్సమెన్‌తోపాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని, అందువల్లే ఈ విజయం వరించిందని ఆయన చెప్పారు. హోరాహోరాగా పోరాడినప్పటికీ 15 పరుగుల తేడాతో ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ విచారం వ్యక్తం చేశాడు. జయాపజయాలు ఎలా ఉన్నా.. రెండు జట్లు బాగా ఆడాయని ఆయన చెప్పాడు.