కోల్‌కతా: అనుభవజ్ఞులతో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్–12 సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. తొలుత కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ (51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) కదంతొక్కగా... 40 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అనంతరం చెన్నై జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది.
సురేశ్ రైనా (42 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరి 2 ఓవర్లలో చెన్నై విజయం కోసం 24 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హ్యారీ గుర్నె వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి రైనా సింగిల్ తీశాడు. ఆ తర్వాత జడేజా వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో చెన్నై ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు సాధించింది. ఇక చివరి ఓవర్లో గెలుపు కోసం చెన్నై 8 పరుగులు చేయాల్సి ఉండగా... చావ్లా వేసిన ఈ ఓవర్ తొలి బంతిని జడేజా బౌండరీ దాటించాడు. ఆ తర్వాత మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు.
తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అంతకుముందు కోల్‌కతా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో తాహిర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, రసెల్‌లను వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. అనంతరం సెంచరీ చేస్తాడనుకున్న క్రిస్ లిన్‌ను కూడా ఔట్ చేశాడు. చెన్నై ప్లేయర్ డు ప్లెసిస్ మొత్తం నాలుగు క్యాచ్‌లు పట్టగా ఇందులో ఉతప్పను ఔట్ చేసిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. తాహిర్ బౌలింగ్‌లో ఉతప్ప భారీ షాట్ ఆడగా... లాంగాఫ్ నుంచి 25 గజాల వరకు ముందుకు పరుగెత్తి డు ప్లెసిస్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment