రైనా వద్దకు దూసుకొచ్చాడు..
కాన్పూర్:భారత దేశంలో క్రికెట్ క్రీడపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. ఇక్కడ క్రికెట్ ను ఒక మతంలా భావిస్తారు. ఒక్కోసారి అభిమానులు తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకు ఎటువంటి వెనుకంజ వేయరు. ఆటగాళ్లపై దూసుకొచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే తరహా దృశ్యం బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్-గుజరాత్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా వద్ద దూసుకొచ్చాడో వీరాభిమాని. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సైతం దాటుకుని మరీ రైనా కలిసేందుకు స్టేడియంలోకి వచ్చేశాడు.
దాంతో రైనా ఒక్కసారిగా కంగుతిన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చే లోపే కరాచలనం చేశాడు. అంతటితో ఆగకుండా పెన్-పేపర్ రైనా చేతికిచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడు. అయితే రైనా అతన్ని మందలించడంతో బలవంతగా మైదానాన్ని వీడాడు. గ్రౌండ్ సిబ్బంది అతన్ని పట్టుకుని స్టేడియంలోకి తీసుకెళ్లారు. ఆ క్రమంలో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కల్గింది. సదరు అభిమాని వేసుకున్న జెర్సీపై రైనా అని రాసి ఉంది.