సురేష్ రైనా@ 150
రాజ్ కోట్: భారత క్రికెటర్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 150 మ్యాచ్ ల క్లబ్ లో చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత తొమ్మిది సీజన్లలో కలిపి 147 మ్యాచ్ లు ఆడిన రైనా.. ఈ ఏడాది మూడు మ్యాచ్ లు ఆడటం ద్వారా అరుదైన మార్కును సొంతం చేసుకున్నాడు. శుక్రవారం పుణె సూపర్ జెయింట్ తో మ్యాచ్ ద్వారా '150' క్లబ్ లో చేరాడు.
మరొకవైపు ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రైనా మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని రైనా అధిగమించాడు. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య దోబుచులాడుతున్న రికార్డులో రైనా మరోసారి టాప్ కు చేరాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో రైనా చేసిన స్కోరు 4,206 కాగా, విరాట్ కోహ్లి 4,172 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ ల పరంగా ఇద్దరి మధ్య పది మ్యాచ్ల వ్యత్యాసం ఉంది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో రైనా తరువాత మహేంద్ర సింగ్ ధోని(147), రోహిత్ శర్మ(146), దినేష్ కార్తీక్(141), కోహ్లి(140)లు ఉన్నారు.