గెలిచేదెవరు..వెళ్లేదెవరు.. | Fighting Hyderabad with Kolkata today | Sakshi
Sakshi News home page

గెలిచేదెవరు..వెళ్లేదెవరు..

Published Tue, May 16 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

గెలిచేదెవరు..వెళ్లేదెవరు..

గెలిచేదెవరు..వెళ్లేదెవరు..

కోల్‌కతాతో హైదరాబాద్‌ పోరు నేడు 
జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌


బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టైటిల్‌ వేటలో అసలైన పోరాటానికి సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీకి సై అంటోంది. సన్‌రైజర్స్‌ బలమంతా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌లోనే ఉంది. అతను బాగా ఆడిన మ్యాచ్‌ల్లో జట్టు సునాయాసంగా గెలిచింది. ఈ సీజన్‌లో అతను అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతున్నాడు. వార్నర్‌ను ఆరంభంలోనే ఔట్‌ చేస్తేనే కోల్‌కతా పట్టు సాధిస్తుంది. లేదంటే అతను పది ఓవర్లు ఆడినా నైట్‌రైడర్స్‌కు కష్టాలు తప్పవు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా హైదరాబాద్‌ బ్యాటింగ్‌ను నడిపిస్తున్నాడు. ఐపీఎల్‌–10లో అత్యధిక పరుగుల జాబితాలో వార్నర్‌ (604) తర్వాతి స్థానం శిఖర్‌ ధావన్‌ (468)దే. వీరిద్దరితో పాటు మిడిలార్డర్‌లో ఆదుకునేందుకు... ప్రత్యర్థులతో ఆడుకునేందుకు యువరాజ్‌ సింగ్‌ ఉండనే ఉన్నాడు.

భళా... బౌలర్లు
ఇక బౌలింగ్‌ విభాగంలోనూ సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. భువనేశ్వర్, రషీద్‌ ఖాన్, సిరాజ్‌లతో బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది. భువీ 25 వికెట్లతో బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యం గా డెత్‌ ఓవర్లలో అతను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. హైదరా బాదీ యువ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కూడా తన సత్తా చాటుకున్నాడు. గుజరాత్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతను 4 వికెట్లు తీసి రైజర్స్‌ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈ సీజన్‌లో 17 వికెట్లు తీసిన అఫ్ఘానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు.

బ్యాటింగ్‌నే నమ్ముకొని...
మరోవైపు కోల్‌కతా ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా... మిగతా మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ సత్తాతోనే విజయాలు సాధిస్తూ వచ్చింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ గంభీర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో వార్నర్, ధావన్‌ల తర్వాత మూడో స్థానం గంభీర్‌దే. తాజాగా క్రిస్‌ లిన్‌ కోల్‌కతా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలతో దుమ్మురేపాడు. ఓపెనర్‌గా వస్తున్న సునీల్‌ నరైన్‌ అడపాదడపా భారీ షాట్లతో వేగవంతమైన శుభారంభాన్నిస్తున్నాడు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్, గ్రాండ్‌హోమ్‌లు బాధ్యతల్ని పంచుకుంటే జట్టు భారీస్కోరు చేయగలదు. బౌలింగ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ రాణిస్తున్నాడు.

నెహ్రా ఔట్‌
సన్‌రైజర్స్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ‘నెహ్రా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు’ అని హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ వెల్లడించారు. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన నెహ్రా 8 వికెట్లు తీశాడు.

జట్లు (అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: గంభీర్‌ (కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, లిన్, మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్, గ్రాండ్‌హోమ్, సునీల్‌ నరైన్, సూర్యకుమార్‌ యాదవ్, కుల్దీప్‌ యాదవ్, క్రిస్‌ వోక్స్, ఉమేశ్‌ యాదవ్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), ధావన్, విజయ్‌ శంకర్, విలియమ్సన్, యువరాజ్, నమన్‌ ఓజా, హెన్రిక్స్, రషీద్‌ ఖాన్, సిరాజ్, భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్‌.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement