సన్‌రైజర్స్‌ ఖేల్‌ ఖతం | Kolkata Knight Riders beat Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ ఖేల్‌ ఖతం

Published Thu, May 18 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

వార్నర్‌ను బౌల్డ్‌ చేసిన చావ్లాను అభినందిస్తున్న గంభీర్, ఉతప్ప

వార్నర్‌ను బౌల్డ్‌ చేసిన చావ్లాను అభినందిస్తున్న గంభీర్, ఉతప్ప

ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్‌ 
ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో చిత్తు


ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం.. తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు ఫట్‌.. అయినా గౌతం గంభీర్‌ సమయోచిత బ్యాటింగ్‌తో గతేడాది ఎలిమినేటర్‌లో జరిగిన ఓటమికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అటు మందకొడి పిచ్‌పై బ్యాటింగ్‌ చేసేందుకు తెగ ఇబ్బంది పడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. వార్నర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

బెంగళూరు: భారీ వర్షం మూడు గంటలపాటు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. అంతకుముందు చిన్నస్వామి మైదానంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 పరుగులు చేసింది.  డేవిడ్‌ వార్నర్‌ (35 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్‌ (26 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించాడు. కూల్టర్‌నీల్‌కు మూడు, ఉమేశ్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. వర్షం అంతరాయంతో రాత్రి 12.35 గంటలకు అంపైర్లు మైదానాన్ని పరీక్షించి ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా 5.2 ఓవర్లలో 48 పరుగులు చేసి నెగ్గింది. గంభీర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

పరుగులు కష్టంగా: టాస్‌ ఓడి  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు పిచ్‌ నుంచి ఆశించిన సహకారం అందలేదు. మందకొడిగా ఉండడంతో పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. దీనికి తోడు ఉమేశ్‌యాదవ్‌ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాటు ఐదో ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ (13 బంతుల్లో 11; 1 ఫోర్‌) వికెట్‌తో దెబ్బతీశాడు. దీంతో పవర్‌ప్లేలో కేవలం మూడు ఫోర్లు మాత్రమే రాగా జట్టు 30 పరుగులు చేయగలిగింది. ఇది ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. తొమ్మిదో ఓవర్‌లో జట్టుకు వార్నర్‌ రూపంలో తొలి సిక్స్‌ లభించగలిగింది. ఈ తరుణంలో జట్టుకు వార్నర్, విలియమ్సన్‌ ద్వారా చక్కటి భాగస్వామ్యం ఏర్పడింది. నిదానంగా ఆడుతూనే వీరిద్దరు క్రమంగా ఎదురుదాడికి దిగడంతో పరుగుల వేగం పెరిగింది.

పదో ఓవర్‌లో విలియమ్సన్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి వరుస ఓవర్లలో అవుట్‌ కావడం సన్‌రైజర్స్‌ను షాక్‌కు గురిచేసింది. 12వ ఓవర్‌లో విలియమ్సన్‌ను కూల్టర్‌నీల్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో వార్నర్‌ను చావ్లా అవుట్‌ చేయడంతో జట్టు సంబరాల్లో మునిగింది. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగి కొద్దిసేపటికే యువరాజ్‌ (9), ధాటిగా ఆడుతున్న విజయ్‌శంకర్‌ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జోర్డాన్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరడంతో జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గంభీర్‌ జోరు: 48 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయింది. రెండో బంతినే లిన్‌ (6) సిక్స్‌గా మలిచినా మరుసటి బంతికే భువనేశ్వర్‌ అతడిని పెవిలియన్‌కు పంపాడు. నాలుగో బంతికి యూసుఫ్‌ లేని పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. జోర్డాన్‌ వేసిన రెండో ఓవర్‌లోనే ఉతప్ప (1) భారీ షాట్‌ ఆడి ధావన్‌కు క్యాచ్‌ ఇవ్వగా గంభీర్‌ ఓ సిక్స్‌ బాదాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో గంభీర్‌ 4,6 బాది ఒత్తిడిని తగ్గిస్తూ 14 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో 2 పరుగులు కావాల్సి ఉండగా సునాయాసంగా నెగ్గింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement