కోల్‌కతా దర్జాగా... | Kolkata Knight Riders win by five wickets | Sakshi
Sakshi News home page

కోల్‌కతా దర్జాగా...

Published Sun, May 20 2018 4:32 AM | Last Updated on Sun, May 20 2018 5:02 AM

Kolkata Knight Riders win by five wickets - Sakshi

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ క్రిస్‌ లిన్, కార్తీక్, ప్రసిద్‌

మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చావోరేవోలాంటి మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్‌ తర్వాత కూడా కోల్‌కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్‌ రైడర్స్‌ తమ సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్‌తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్‌ కూడా అదే వేదికపై ఆడుతుంది.

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–11లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలిచింది. ఉప్పల్‌ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, కేన్‌ విలియమ్సన్‌ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్‌ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ప్రసిధ్‌ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్‌ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (22 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు.  

ఒకే ఓవర్లో నలుగురు ఔట్‌...
తొలి బంతికే ధావన్‌ కొట్టిన ఫోర్‌తో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. మరోవైపు సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్‌కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి  సన్‌రైజర్స్‌ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్‌ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్‌ కూడా తన ఫామ్‌ను కొనసాగించడంతో రైజర్స్‌ దూసుకుపోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన అతను, ఆ తర్వాత  సియర్ల్స్‌ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్‌ క్యాచ్‌ వదిలేసిన అనంతరం ధావన్‌ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్‌ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్‌ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్‌ కలిపి హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది.   

లిన్‌ మెరుపులు...
ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్‌ నరైన్‌ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్‌ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్‌ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత షకీబ్‌ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్‌ ఔటయ్యాడు. లిన్‌ కూడా ధాటిగా ఆడటంతో కోల్‌కతా రన్‌రేట్‌ దూసుకుపోయింది. పవర్‌ప్లేలో కేకేఆర్‌ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ చకచకా సాగింది.  11 పరుగుల వద్ద భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను రషీద్‌ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్‌ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్‌ బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో 36 బంతుల్లో లిన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్‌ (4), నితీశ్‌ రాణా(7)  వెనుదిరిగినా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మిగతా పనిని పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్‌ 50; గోస్వామి (సి) రసెల్‌ (బి) కుల్దీప్‌ 35; విలియమ్సన్‌ (సి) రసెల్‌ (బి) సియర్ల్స్‌ 36; మనీశ్‌ పాండే (సి) సబ్‌–రింకూ సింగ్‌ (బి) ప్రసిధ్‌ 25; యూసుఫ్‌ పఠాన్‌ (సి) ఉతప్ప (బి) నరైన్‌ 2; బ్రాత్‌వైట్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌ 3; షకీబ్‌ (సి) నరైన్‌ (బి) ప్రసిధ్‌ 10; రషీద్‌ ఖాన్‌ (సి) కార్తీక్‌ (బి) ప్రసిధ్‌ 0; భువనేశ్వర్‌ రనౌట్‌ 0; కౌల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172.  

వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172.

బౌలింగ్‌: నితీశ్‌ రాణా 1–0–5–0, ప్రసిధ్‌ 4–0–30–4, రసెల్‌ 3–0–31–1, నరైన్‌ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్‌ 4–0–35–1, సియర్ల్స్‌ 2–0–24–1.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: లిన్‌ (సి) పాండే (బి) కౌల్‌ 55; నరైన్‌ (సి) పాండే (బి) షకీబ్‌ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్‌ 45; కార్తీక్‌ నాటౌట్‌ 26; రసెల్‌ (సి) పాండే (బి) కౌల్‌ 4; రాణా (సి) భువనేశ్వర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 7; గిల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173.

వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–0, సందీప్‌ శర్మ 2–0–30–0, కౌల్‌ 4–0–26–2, షకీబ్‌ 3–0–30–1, రషీద్‌ ఖాన్‌ 4–0–31–0, బ్రాత్‌వైట్‌ 2.4–0–21–2. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement