'ముంబై' చలో హైదరాబాద్‌ | Mumbai Indians beat kkr in 6 wickets | Sakshi
Sakshi News home page

'ముంబై' చలో హైదరాబాద్‌

Published Sat, May 20 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

'ముంబై' చలో హైదరాబాద్‌

'ముంబై' చలో హైదరాబాద్‌

ఐపీఎల్‌–10 ఫైనల్లో ముంబై ఇండియన్స్‌  
క్వాలిఫయర్‌–2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం
రేపు హైదరాబాద్‌లో రైజింగ్‌ పుణేతో టైటిల్‌ పోరు  
నాలుగు వికెట్లతో మెరిసిన కరణ్‌ శర్మ  


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ముంబై ఇండియన్స్‌ మరోసారి నిరూపించుకుంది. ఈ సీజన్‌లో ముచ్చటగా మూడోసారి కేకేఆర్‌పై నెగ్గిన ముంబై ఐపీఎల్‌–10 ఫైనల్లో అడుగుపెట్టింది. కరణ్‌ శర్మ మాయాజాలం... బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు విలవిల్లాడిన గంభీర్‌ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సునాయాస లక్ష్యాన్ని కాస్త తడబడుతూనే ముంబై ఛేదించగలిగింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఓటమి లేకపోవడం విశేషం. ఇక ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తుదిపోరులో రైజింగ్‌ పుణే
సూపర్‌ జెయింట్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది.


బెంగళూరు: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నాలుగోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలర్లు రాజ్యమేలిన ఈ తక్కువ స్కోరింగ్‌ మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్‌; 8 ఫోర్లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాంక్‌ జగ్గి (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) మాత్రమే కాస్త పోరాడగలిగారు. కరణ్‌ శర్మ నాలుగు, బుమ్రా మూడు, జాన్సన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. పీయూష్‌ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి. కరణ్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

బౌలర్ల ధాటికి విలవిల
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను ముంబై బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఏ దశలోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. దీంతో ఇదే మైదానంలో పవర్‌ప్లేలో 105 పరుగులతో రికార్డు సృష్టించిన ఈ జట్టు ఈసారి అవమానకర రీతిలో బ్యాటింగ్‌ చేసింది. తమ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్న లిన్‌ (4)ను రెండో ఓవర్‌లోనే బుమ్రా అవుట్‌ చేయగా.. నరైన్‌ (10 బంతుల్లో 10; 1 సిక్స్‌)ను కరణ్‌ శర్మ ఐదో ఓవర్‌లో  పెవిలియన్‌కు పంపించాడు. ఇక తదుపరి ఓవర్‌లో రాబిన్‌ ఉతప్ప (1)ను బుమ్రా అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ప్లేలో ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇదే అత్యల్ప స్కోరు. ఏడో ఓవర్‌లో కరణ్‌ శర్మ కెప్టెన్‌ గంభీర్‌ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), గ్రాండ్‌హోమ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో కోల్‌కతా 31 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో సూర్యకుమార్‌ యాదవ్, ఇషాంక్‌ జగ్గి జట్టుకు ఆపద్బాంధవ పాత్ర పోషించారు. కృనాల్‌ వేసిన ఓ ఓవర్‌లో సిక్స్‌ బాదిన సూర్యకుమార్‌ మరుసటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్‌లో జగ్గి కూడా రెండు ఫోర్లు బాదినా 15వ ఓవర్‌లో అతడిని అవుట్‌ చేసి కరణ్‌ శర్మ మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా 17వ ఓవర్‌లో జాన్సన్‌.. చావ్లా (2), కూల్టర్‌నీల్‌ (6) వికెట్లను తీయగా మరుసటి ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ను బుమ్రా బోల్తా కొట్టించడంతో కోల్‌కతా భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది.

ఆరంభంలో తడబడినా...
లక్ష్యం తక్కువగానే ఉన్నా ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ అంత సజావుగా ఏమీ సాగలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు మూడు వికెట్లకు 36 పరుగులు... సునాయాసంగా బ్యాటింగ్‌ చేయగలదనుకున్న ముంబై టాప్‌ ఆర్డర్‌ను కోల్‌కతా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సిమన్స్‌ (3) అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి ఎల్బీగా వెనుదిరగ్గా ఆ తర్వాతి ఓవర్‌లో ఉమేశ్‌.. పార్థివ్‌ (9 బంతుల్లో 14; 3 ఫోర్లు)ను అవుట్‌ చేసి ఒక్కసారిగా ఆందోళన పెంచాడు. ఆరో ఓవర్‌లో చావ్లా... రాయుడు (6)ను కూడా అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఈ స్థితిలో కెప్టెన్‌ రోహిత్, కృనాల్‌ నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటుకు లోనుకాకుండా వీరు జాగ్రత్తగా ఆడారు.

9వ ఓవర్‌ నుంచి క్రమంగా పరుగుల వేగం పెరిగింది. చావ్లా వేసిన ఆ ఓవర్‌లో కృనాల్‌ రెండు ఫోర్లు బాది జోరు కనబరిచాడు. అతడి మరుసటి ఓవర్‌లోనూ తను రెండు ఫోర్లు రాబట్టగా రోహిత్‌ ఓ సిక్సర్‌ సంధించడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఓ నిర్లక్ష్యపు షాట్‌కు రోహిత్‌ అవుట్‌ కావడంతో నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పొలార్డ్‌ (9 నాటౌట్‌) అండతో కృనాల్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టును గట్టెక్కించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement