చెన్నై... దంచెన్‌ | CSK win by five wickets | Sakshi
Sakshi News home page

చెన్నై... దంచెన్‌

Published Wed, Apr 11 2018 1:36 AM | Last Updated on Wed, Apr 11 2018 7:45 AM

CSK win by five wickets - Sakshi

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బిల్లింగ్స్‌ 

సొంతగడ్డపై తొలి మ్యాచ్‌... అటు దండిగా అభిమానుల మద్దతు... ఇంకేం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరుకు భారీ లక్ష్యం కూడా కరిగిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

చెన్నై: సీజన్‌లో తొలిసారి 200 పరుగుల పైగా లక్ష్యం ఎదురైనా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెరవలేదు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌ (19 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శామ్‌ బిల్లింగ్స్‌ (23 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), అంబటి రాయుడు (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో ఆ జట్టు 203 లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ఆండ్రీ రసెల్‌ (36 బంతుల్లో 88 నాటౌట్‌; 1 ఫోర్, 11 సిక్స్‌లు) అసాధారణ ఆటతో నిలబెట్టాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తోడుగా విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 

27 బంతుల వ్యవధిలో 10 సిక్స్‌లు... 
తొలి ఓవర్లో 18 పరుగులు సాధించి కోల్‌కతాకు ఓపెనర్లు సునీల్‌ నరైన్‌ (4 బంతుల్లో 12; 2 సిక్స్‌లు), లిన్‌ (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) బుల్లెట్‌ ఆరంభాన్నిచ్చారు. హర్భజన్‌ రెండో ఓవర్లోనే నరైన్‌ ఆట కట్టించినా వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్‌ ఉతప్ప (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తగ్గకపోవడంతో ఇన్నింగ్స్‌ మంచి రన్‌రేట్‌తోనే సాగింది. అతడితో పాటు లిన్, నితీశ్‌ రాణా (16), రింకూ సింగ్‌ (2) వెంటవెంటనే వెనుదిరగడంతో పది ఓవర్లకు జట్టు 89/5తో నిలిచింది. ఈ దశలో కార్తీక్, రసెల్‌ ఆచితూచి ఆడారు. చివర్లో ఉపయోగపడతాడని అట్టిపెట్టిన బ్రేవోను 14వ ఓవర్లో బౌలింగ్‌కు దించడంతోనే అంతా తారుమారైంది. ఆ ఓవర్‌లో రసెల్‌ సిక్స్‌ సహా 10 పరుగులు చేశాడు. ఠాకూర్‌ వేసిన 16, 20వ ఓవర్లలో రెండేసి, బ్రేవో వేసిన 17, 18వ ఓవర్లలో మూడేసి చొప్పున సిక్స్‌లు బాదిన రస్సెల్‌... జట్టు స్కోరును 200 దాటించాడు. అతడు 27 బంతుల వ్యవధిలో 10 సిక్స్‌లు కొట్టడం విశేషం. 

ఆ ముగ్గురి జోరుతో... 
వాట్సన్, రాయుడు పోటాపోటీగా ఆడుతూ 5.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించడంతో ఛేదనను చెన్నై దీటుగా ఆరంభించింది. రైనా (14), ధోని (28 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌) విఫలమైనా బిల్లింగ్స్‌ చక్కటి షాట్లతో లక్ష్యం దిశగా నడిపించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు అవుటయ్యాడు. సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా ఉండగా చివరి ఓవర్‌ వేసిన వినయ్‌ కుమార్‌ లైన్‌ తప్పాడు. ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన జడేజా మ్యాచ్‌ను ముగించాడు. 

డుప్లెసిస్‌ పైకి బూటు... 
కావేరి నదీ జలాల బోర్డు ఏర్పాటు ఆందోళనల కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. టాస్‌కు 13 నిమిషాలు ఆలస్యమైంది. స్టేడియం పరిసరాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని టిక్కెట్‌ ఉన్నవారినే లోపలకు పంపారు. స్టేడియంలోని ఓ వ్యక్తి డు ప్లెసిస్‌పైకి బూటు విసిరాడు. చుట్టూ ఉన్నవారు కావేరి వివాదంపై నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement