
పుణేతో తలపడేది ఎవరు?
చరిత్ర చూసుకుంటే అంతా వారికే అనుకూలం... ఐపీఎల్‌లో
►నేడు కోల్‌కతా, ముంబై మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్
►గెలిచిన జట్టు ఫైనల్‌కు...
►రాత్రి 8.00 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
చరిత్ర చూసుకుంటే అంతా వారికే అనుకూలం... ఐపీఎల్‌లో ముఖాముఖి ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఏకంగా 15 మ్యాచ్‌ల్లో విజయాలు.. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చిత్తు చేశారు.. ఇదీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కున్న ట్రాక్ రికార్డు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై తమ ఘనచరిత్రను మరోసారి ఆవిష్కృతం చేసి తుది పోరుకు అర్హత సాధించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
ఇక ముంబైతో తమ ప్రస్థానం ఎలా ఉన్నా ఈ కీలక సమరంలో పైచేయి సాధించాలని నైట్‌రైడర్స్ కసితో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గంభీర్ బృందం తమలోని లోపాలను సరిదిద్దుకుని ఎదురుదాడికి దిగేందుకు వేచిచూస్తోంది.
బెంగళూరు: ఐపీఎల్ పదో సీజన్‌లో టైటిల్ పోరుకు ముందు మరో కీలక సమరం. నేడు (శుక్రవారం) జరిగే రెండో క్వాలిఫయర్‌లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఉప్పల్ మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబై తొలి క్వాలిఫయర్‌లో పుణే చేతిలో చిత్తు కాగా... ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంప్ సన్‌రైజర్స్‌పై కోల్‌కతా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య గత చరిత్రను తీసుకుంటే మాత్రం ముంబై పైచేయిలో ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై కోల్‌కతా గెలిచింది లేదు. వాస్తవానికి ఐపీఎల్–10లో ముంబైకి తొలి విజయం కూడా కేకేఆర్‌పైనే వచ్చింది. ఇదే జోరుతో నేటి మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో చేరాలని ముంబై భావిస్తోంది. మరోవైపు ఇలాంటి ప్రతికూలతలను అధిగమించి సత్తా చాటుకోవాలని గంభీర్‌సేన ఆశిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ప్రత్యర్థికి సమ ఉజ్జీగా కనిపిస్తున్న కోల్‌కతా గట్టిపోటీనిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా జరిగిన తొమ్మిది సీజన్లలో ఐపీఎల్ టైటిల్‌ను ఈ రెండు జట్లూ రెండేసి సార్లు గెలుచుకోవడం విశేషం. అయితే బుధవారంలాగే నేడు కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి.
శుభారంభాలతో జోరు
ముంబై ఓపెనర్లలో పార్థివ్ పటేల్ మంచి ఫామ్‌లో ఉండగా, లెండిల్ సిమన్స్ కూడా ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ తమ ఆటతో జట్టుకు శుభారంభాలను అందించి మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడిని తగ్గిస్తున్నారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్, రాయుడు, పొలార్డ్ జట్టును భారీ స్కోరువైపు తీసుకెళుతున్నారు. అయితే తమ చివరి మ్యాచ్‌లో వీరు పుణే బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. ఒక్క పార్థివ్ మినహాయించి బ్యాటింగ్ ఆర్డర్ అంతా విఫలమైంది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావీయకూడదనే ఆలోచనలో ఉంది. హార్దిక్, కృనాల్ పాండ్యా సోదరులు ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్‌లో పేస్ త్రయం మలింగ, మెక్లీనగన్, బుమ్రా చెలరేగిపోతున్నారు. స్పిన్‌లో అనుభవజ్ఞుడైన హర్భజన్‌పై జట్టు ఆధారపడుతోంది.
దూకుడే మంత్రం
ముంబై మాదిరిగానే కేకేఆర్ కూడా సమర్థులైన ఓపెనర్లను కలిగి ఉంది. క్రిస్ లిన్‌తో కలిసి ఓపెనర్లు గంభీర్, నరైన్, ఉతప్ప అద్భుతంగా ఆడుతున్నారు. లిన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. పించ్ హిట్టర్‌గా నరైన్ సూపర్ సక్సెస్‌లో ఉన్నాడు. 15 బంతుల్లో అర్ధసెంచరీ చేసి రికార్డుల కెక్కాడు. అతని నుంచి జట్టు మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్ ఇప్పటికే 16 వికెట్లతో జోరు మీదున్నాడు. కూల్టర్‌నీల్ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆదుకుంటున్నాడు. నరైన్ తన స్పిన్‌తో తికమకపెట్టేవాడే. ముంబై ఓపెనర్లను త్వరగా దెబ్బతీసి ఒత్తిడి పెంచితే జట్టుకు విజయావకాశాలుంటాయి. మనీశ్ పాండే గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం కోల్‌కతా బ్యాటింగ్‌పై ప్రభావం చూపించవచ్చు.
జట్లు: (అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్, పొలార్డ్, రాయుడు, హార్దిక్, కృనాల్, హర్భజన్, మెక్లీనగన్, మలింగ, బుమ్రా.
కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), లిన్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్, నరైన్, సూర్యకుమార్/ఇషాంక్ జగ్గీ, కుల్దీప్ యాదవ్, చావ్లా, కూల్టర్‌నీల్, ఉమేశ్ యాదవ్, బౌల్ట్.
►నాకౌట్ దశలో కోల్‌కతాతో ఒకే సారి (2011) తలపడిన ముంబై ఆ మ్యాచ్‌లో గెలిచింది.