నైట్‌రైడర్స్‌ దూకుడు   | Kolkata Knight Riders who won the IPL title for the second time | Sakshi
Sakshi News home page

నైట్‌రైడర్స్‌ దూకుడు  

Published Mon, Mar 18 2019 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 5:04 AM

Kolkata Knight Riders who won the IPL title for the second time - Sakshi

రెండేళ్ల క్రితం గౌతం గంభీర్‌ కెప్టెన్సీలో కొత్త జట్టుతో అద్భుత ప్రదర్శన కనబర్చి తొలిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2014లో కూడా దానిని పునరావృతం చేసింది. రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకొని చెన్నై తర్వాత ఈ ఘనత సాధించిన మరో జట్టుగా నిలిచింది. ఈ టీమ్‌లో 2012లో విజేతగా నిలిచిన జట్టులోని వారే ఎక్కువ మంది ఉండి కీలక పాత్ర పోషించారు. అనూహ్యమైన ఆటతీరుతో లీగ్‌ దశలో ఏకంగా 11 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ చివరకు ఫైనల్లో చతికిల పడింది. ఆ జట్టుకు ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బోర్డుతో విభేదాల కారణంగా పుణే వారియర్స్‌ తప్పుకోవడంతో లీగ్‌ మొదలైన కొత్తలో ఉన్నట్లుగా మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్‌ జరగడం విశేషం.  

యూఏఈలో.... 
ఐపీఎల్‌ మొదలైన తర్వాత రెండోసారి 2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2009లాగే మళ్లీ దక్షిణాఫ్రికాలో నిర్వహించాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు తెచ్చింది. అయితే ఈసారి ఫ్రాంచైజీలు దానిని వ్యతిరేకించాయి. ఆర్థికపరంగా, నిర్వ హణాపరంగా 2009లో తమకు చాలా సమస్యలు తలెత్తాయని చెప్పడంతో చివరకు రెండు దశలుగా లీగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. తొలి 20 మ్యాచ్‌లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో, తర్వాతి 40 మ్యాచ్‌లు భారత్‌లో జరిగాయి.  

ఫైనల్‌ ఫలితం... 
క్వాలిఫయర్‌–1లో పంజాబ్‌ను ఓడించి కోల్‌కతా... క్వాలిఫయర్‌ 2లో చెన్నైని ఓడించి పంజాబ్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. వృద్ధిమాన్‌ సాహా (115 నాటౌట్‌) అద్భుత సెంచరీ, మనన్‌ వోహ్రా (67) అర్ధ సెంచరీ సహాయంతో ముందుగా పంజాబ్‌ 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత కోల్‌కతా మరో 3 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లకు 200 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. ‘మ్యా¯Œ  ఆఫ్‌ ద మ్యాచ్‌’ మనీశ్‌ పాండే (94) ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.  

మూడు శతకాలు... 
టోర్నీలో మూడు సెంచరీలు నమోదయ్యాయి. సెహ్వాగ్‌ (122), సాహా (115), లెండిల్‌ సిమ¯Œ ్స (100) ఈ ఘనత సాధించగా... 4 అర్ధ సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్‌ 95, 95, 90, 89 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. లీగ్‌లో అత్యధికంగా మ్యాక్స్‌వెల్‌ 36 సిక్సర్లు బాదడం మరో విశేషం.  

వేలం విశేషాలు... 
2014 సీజన్‌లో మళ్లీ కొత్తగా వేలం జరిగితే... మొదటిసారి ఆటగాళ్లకు డాలర్లు రూపంలో కాకుండా రూపాయలుగా చెల్లించారు. అన్నింటికంటే ప్రధాన మార్పు ‘అన్క్యాప్డ్‌’ ప్లేయర్స్‌ విషయంలో జరిగింది. అప్పటి వరకు వారిని వేలంలో ఉంచకుండా నిర్ణీత మొత్తం అందజేసిన గవర్నింగ్‌ కౌన్సిల్‌ వారికీ వేలంలో చేరే అవకాశం ఇచ్చింది. దీని వల్ల భారత జట్టుకు ఆడకపోయినా ప్రత్యేక ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు భారీ మొత్తం అందుకునే అవకాశం దక్కింది. వీరిలో అత్యధికంగా కరణ్‌ శర్మ (రూ. 3.75 కోట్లు)కు దక్కాయి.  

ఇద్దరు మినహా... 
లీగ్‌లో కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఆడి కోల్‌కతా విజయంలో భాగంగా నిలిచిన 17 మంది ఆటగాళ్లలో మన్వీందర్‌ బిస్లా, సూర్యకుమార్‌ యాదవ్‌ మినహా మిగతావారంతా అంతర్జాతీయ క్రికెటర్లు కావడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement