పంజాబ్ రేసులోనే...
∙ కోల్‌కతాపై కింగ్స్ ఎలెవన్ గెలుపు
∙ లిన్ పోరాటం వృథా
∙ రసవత్తరంగా ప్లే–ఆఫ్ రేస్
మొహాలి: ఐపీఎల్ లీగ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. కీలకమైన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ బౌలర్లు పంజా విసిరారు. లిన్ ధాటికి ఎదురొడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేయగల్గింది. క్రిస్ లిన్ ( 52 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్, యూసుఫ్ పఠాన్ రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బౌలర్ మోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాణించిన మ్యాక్స్‌వెల్...
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ 3 ఓవర్లదాకా చప్పగానే సాగింది. ఓపెనర్లు గప్టిల్ (12), మనన్ వోహ్రా (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) వేగం పెంచిన వెంటనే కోల్‌కతా బౌలర్లు పెవిలియన్ చేర్చారు. నరైన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వోహ్రా అదే జోరులో ఉమేశ్ యాదవ్ మరుసటి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాదాడు. కానీ అదే ఓవర్లో వోహ్రా, తర్వాతి నరైన్ ఓవర్లో గప్టిల్ ఔటయ్యారు. కాసేపటికి మార్‡్ష (11)ను వోక్స్ బౌల్డ్ చేశాడు. 56 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన దశలో వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ మొదట జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. కుల్దీప్ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు బాదినప్పటికీ మరో షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రాహుల్ తేవటియా (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.
లిన్ మళ్లీ ఫిఫ్టీ...
కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ తన సూపర్ ఫామ్ చాటాడు. నరైన్ (10 బంతుల్లో 18; 4 ఫోర్లు)తో కలిసి లిన్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. వీళ్లిద్దరు సగటున ఓవర్‌కు 10 పరుగులు చేశారు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద నరైన్‌ను మోహిత్ శర్మ బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ సహకారంతో లిన్ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన లిన్‌కు ఇది మూడో అర్ధసెంచరీ కావడం విశేషం. అయితే పరుగు తేడాతో గంభీర్ (8), రాబిన్ ఉతప్ప (0) నిష్క్రమించారు. ఒకే ఓవర్లో రాహుల్ తెవటియా వీళ్లిద్దరిని పెవిలియన్‌కు పంపడం కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీసింది. తర్వాత క్రీజ్‌లోకి మనీశ్ పాండే (23 బంతుల్లో 18; 1 ఫోర్) అండతో లిన్ తన ధాటిని కొనసాగించాడు. కీలక తరుణంలో పాండేను హెన్రీ ఔట్ చేయగా, కీలకదశలో లిన్ రనౌట్ కావడంతో కోల్‌కతా విజయంపై ఆశలు వదులుకుంది.