కోల్‌కతా కోటలో నైట్‌రైడర్స్ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్ తనకే సాధ్యమైన రీతిలో భీకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలిపించింది. బౌలర్ల సమష్టి వైఫల్యంతో ముందే మ్యాచ్‌పై కింగ్స్ ఎలెవన్ ఆశలు కోల్పోగా... మయాంక్, మిల్లర్ మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి.
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 28 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్‌కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేయగా...చివర్లో ఆండ్రీ రసెల్ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (40 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించేందుకు అవి సరిపోలేదు.
రసెల్ విధ్వంసం...
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మరో 5.3 ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో రసెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తాను ఆడిన తొలి 7 బంతుల్లో అతను చేసింది 5 పరుగులే! అయితే ఆ తర్వాత అతని వీర విధ్వంసం మొదలైంది. టై వేసిన ఓవర్లో వరుసగా నాలుగు బంతులను 6, 4, 4, 6లుగా మలచి రసెల్ చెలరేగిపోయాడు. తర్వాతి ఓవర్లో షమీ బాధితుడయ్యాడు. అతని ఓవర్లో కూడా వరుసగా 6, 6, 6, 4 బాదాడు. సరిగ్గా చెప్పాలంటే తాను ఆడిన వరుస ఎనిమిది బంతుల్లో రసెల్ 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు రాబట్టాడు. టై బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా... బౌండరీ వద్ద మయాంక్ పట్టిన చక్కటి క్యాచ్‌తో రసెల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.
నోబాల్‌తో బతికిపోయి...
రసెల్ స్కోరు 3 వద్ద ఉండగా షమీ అద్భుత యార్కర్‌తో అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే తన తప్పేమీ లేకపోయినా షమీని దురదృష్టం వెంటాడింది. నిబంధనల ప్రకారం ఆ సమయంలో 30 గజాల సర్కిల్‌లో కనీసం నాలుగు ఫీల్డర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. దాంతో అంపైర్ ‘నోబాల్’గా ప్రకటించడంతో రసెల్ బతికిపోయాడు. షమీ తర్వాతి ఓవర్లో కోల్‌కతా ఏకంగా 25 పరుగులు కొల్లగొట్టింది.
రాణా సిక్సర్ల జోరు...
నితీశ్ రాణా కూడా దూకుడైన ఆటతో చెలరేగి నైట్‌రైడర్స్‌కు భారీ స్కోరు అందించాడు. అశ్విన్ బౌలింగ్‌ను అతను చితక్కొట్టాడు. అశ్విన్ రెండో, మూడో ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాదిన అతను... చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తర్వాతి ఓవర్ వేసిన పార్ట్‌టైమర్ మన్‌దీప్ సింగ్‌ను వదలకుండా 2 సిక్సర్లు కొట్టాడు. విలోన్ వేసిన మరుసటి ఓవర్లో కూడా రాణా అదే ధాటిని కొనసాగించాడు. వరుస బంతుల్లో 4, 6, 4 కొట్టాడు. 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. కోల్‌కతా టీమ్ వెటరన్ ఉతప్ప కూడా చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ చేశాడు.
పాపం వరుణ్...
‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ కనీస ధరకు 42 రెట్లు ఎక్కువ మొత్తానికి (రూ. 8.4 కోట్లు) వరుణ్ చక్రవర్తిని పంజాబ్ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అతనికి తొలి టి20/ఐపీఎల్ మ్యాచ్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐపీఎల్‌లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు (25) ఇచ్చిన బౌలర్‌గా అతను నిలిచాడు. వరుణ్ మొదటి ఓవర్లో సునీల్ నరైన్ వరుసగా 6, 2, 4, 6, 6తో చెలరేగాడు. అతని రెండో ఓవర్లో ఉతప్ప రెండు ఫోర్లు బాదగా, మూడో ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి రాణా వికెట్ తీయడం ఊరట!
మయాంక్, మిల్లర్ మాత్రమే...
భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ (1) మళ్లీ విఫలం కాగా... క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు గేల్ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరితో పాటు సర్ఫరాజ్ (13) కూడా వెనుదిరిగాక గెలిపించే భారం మయాంక్, మిల్లర్‌లపై పడింది. నరైన్ ఓవర్లో మిల్లర్ వరుసగా 6, 4 కొట్టగా...మయాంక్ వరుసగా మరో రెండో ఫోర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మయాంక్‌ను చావ్లా బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (47 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్ చివరి వరకు నిలిచినా పంజాబ్‌కు పరాజయం తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment