పంజాబ్ పుంజుకునేనా..?
►నేడు కోల్‌కతాతో తలపడనున్న కింగ్స్
►ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా పంజాబ్ పోరాటం
►జోరుమీదున్న నైట్‌రైడర్స్
మొహాలీ: ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరాడనుంది. నాకౌట్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లన్నీ తప్పక నెగ్గాల్సిన ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాక్స్‌వెల్‌సేన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖారారు చేసుకున్న కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తోంది.
పంజాబ్‌కు చావోరేవో..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాల కోసం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పుణే, హైదరాబాద్‌కు మంచి అవకాశాలుండగా.. పంజాబ్ పరిస్థితి మాత్రం చావోరేవోలాగా మారింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌సేన ఐదు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరుకోవాలంటే పంజాబ్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది.
ఈక్రమంలో మంగళవారం కోల్‌కతాతో మ్యాచ్ పంజాబ్‌కు కీలకంగా మారింది. నిజానికి ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించి ఉంటే మ్యాక్స్‌వెల్‌సేనకు నాకౌట్‌కు సులభంగా అర్హత సాధించడానికి అవకాశం ఉండేది. అయితే పేలవమైన ఫీల్డింగ్‌తోపాటు పసలేని బౌలింగ్‌తో ఆ మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం పాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌లో హషీమ్ ఆమ్లా సొగసైన సెంచరీతో ఆకట్టుకున్నా అది వృథాగా మారింది. ఈ సీజన్‌లో ఆమ్లాకిది రెండోసెంచరీ కావడం విశేషం. అతనితోపాటు షాన్‌మార్‡్ష, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సత్తచాటడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. అయితే బౌలర్ల వైఫల్యంతో సదరు మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన ఆమ్లా 60 సగటుతో 420 పరుగులు చేశాడు. వీటిలో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌పై చేసిన రెండు సెంచరీలు ఉన్నాయి.
మ్యాక్స్‌వెల్ (219 పరుగులు) స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. షాన్ మార్‡్ష అకట్టుకుంటున్నాడు. మనన్ వోహ్రా, అక్షర్‌పటేల్, వృద్ధిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, డేవిడ్ మిల్లర్ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అక్షర్ పటేల్ (13 వికెట్లు), మోహిత్ శర్మ (9), వరుణ్ అరోన్ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. పంజాబ్ బౌలింగ్ మరింత పదును తేలాల్సి ఉంది. ఇరుజట్లు ఈ సీజన్‌లో పరస్పరం ఓసారి తలపడగా ఎనిమిది వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆజట్టుపై నెగ్గడంతో ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్ వైపు అడుగులు వేయాలని పంజాబ్ కృతనిశ్చయంతో ఉంది.
కోల్‌కతా కుమ్ముడు...
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి జోరుమీదుంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో 16 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా.. పంజాబ్‌పై విజయం సాధించి 18 పాయింట్లతో అధికారికంగా నాకౌట్ దశకు చేరుకోవాలనుకుంటుంది. మరోవైపు వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు సునీల్ నరైన్, క్రిస్ లిన్ విధ్వంసక అర్ధసెంచరీలతో జోరు చూపించడంతో బెంగళూరు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ఉఫ్‌మని ఊదేసింది. వీరి దూకుడుకు ఐపీఎల్ టోర్నీలో కొన్ని రికార్డులు గల్లంతవడం విశేషం. మరోవైపు కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ తమ ఓపెనర్లపై ప్రశంసలు జల్లు కురిపించాడు.
కెరీర్ మొత్తంలో తాను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదేనని పేర్కొన్నాడు. ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే గౌతం గంభీర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 425 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మనీశ్ పాండే ఆకట్టుకుంటున్నాడు. ఇక ఓపెనర్ అవతారం ఎత్తిన సునీల్ నరైన్ 196 పరుగులతో విజయవంతమయ్యాడు. క్రిస్ లిన్ చేరికతో కోల్‌కతా బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. గాయంతో దూరమైన రాబిన్ ఉతప్ప తిరిగి జట్టుతో చేరనున్నాడు. యూసుఫ్ పఠాన్, కొలిన్ గ్రాండ్‌హోమ్, సూర్యకుమార్ యాదవ్ గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
ఇక బౌలింగ్ విభాగంలో క్రిస్ వోక్స్ సత్తా చాటుతున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ (13 వికెట్లు), నాథన్ కూల్టర్‌నీల్ (11), సునీల్ నరైన్ (9), కుల్‌దీప్ యాదవ్ (9) ఆకట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కవచ్చు. మరోవైపు జట్టు రిజర్వ్‌బెంచ్ సత్తాను కూడా పరిశీలించేందుకు గంభీర్‌సేన ప్రయత్నిస్తోంది. అలాగే ఈ సీజన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన కోల్‌కతా.. తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది.