కోల్‌కతా కుమ్ముడు
►వరుస విజయాలతో ‘టాప్’ స్థానం పదిలం
►ఢిల్లీపై ఏడు వికెట్లతో ఘనవిజయం
►రాణించిన గంభీర్, ఉతప్ప, కౌల్టర్‌నీల్..
►సంజూ సామ్సన్ అర్ధసెంచరీ వృథా
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎదురేలేకుండా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించింది. శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గంభీర్‌సేన ఏడు వికెట్లతో గెలుపొందింది. స్థానిక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. జట్టులో సంజూ సామ్సన్ మెరుపు అర్ధసెంచరీ (38 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నమోదు చేయగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 47, 4 ఫోర్లు, ఓ సిక్సర్) ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా 16.2 ఓవర్లలో మూడు వికెట్లకు 161 పరుగులు చేసి ఛేదించింది. జట్టులో గౌతం గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (52 బంతుల్లో 71 నాటౌట్, 11 ఫోర్లు)తో ముందుండి జట్టును నడుపగా.. రాబిన్ ఉతప్ప విధ్వసంకర అర్ధసెంచరీ (33 బంతుల్లో 59, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా 14 పాయింట్లతో పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
మెరిసిన సామ్సన్
టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సామ్సన్, కరుణ్ నాయర్ (15) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. నరైన్ బౌలింగ్‌లో నాయర్ నిష్క్రమించగా తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో సామ్సన్ 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్ సామ్సన్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో కూల్టర్‌నీల్ ఒకే ఓవర్లో రిషభ్ పంత్ (6), శ్రేయస్‌లను ఔట్‌చేసి చావుదెబ్బ తీశాడు. కోరె అండర్సన్ (2) రనౌట్ కావడంతో ఢిల్లీ 23 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో రన్‌రేట్ మందగించింది.
గౌతీ అజేయ పోరాటం
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కడదాకా నడిపించాడు. నరైన్ (4) వికెట్ ఆరంభంలోనే కోల్పోగా... తర్వాత వచ్చిన ఉతప్పతో కలిసి గర్జించాడు. ఉతప్ప 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను సమన్వయ లోపంతో మిశ్రా, సామ్సన్ జారవిడిచారు. దీంతో బతికిపోయిన ఉతప్ప సిక్సర్లతో ఢిల్లీ బౌలర్ల భరతం పట్టాడు. గతమ్యాచ్‌కు రిప్లేలా వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. దూకుడుగా ఆడిన ఉతప్ప 24 బంతుల్లో, గంభీర్ 39 బంతుల్లో అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఏ దశలోనూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించాక ఉతప్ప నిష్క్రమించగా, మిగతా లాంఛనాన్ని మనీశ్ (5), జాక్సన్ (12 నాటౌట్)లతో గంభీర్ పూర్తి చేశాడు.
ఈడెన్ గడ్డపై కోల్‌కతా చేజింగ్‌లో వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2012 తర్వాత ఛేదనలో ఇక్కడ ఓడనేలేదు. గంభీర్ ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తిచేశాడు. ఓవరాల్‌గా టీ20 కెరీర్‌లో 6 వేల క్లబ్‌లో చేరాడు. రైనా, కోహ్లి, రోహిత్‌ల తర్వాత ఈ ఘనతకెక్కిన నాలుగో బ్యాట్స్‌మన్ గౌతమ్.